తెలంగాణలో కాంగ్రెస్ కు 70 పైగా సీట్లు ఖాయం..: ఏపిసిసి చీఫ్ రుద్రరాజు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని... 70కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని ఏపిసిసి అధ్యక్షుడు రుద్రరాజు ధీమా వ్యక్తం చేసారు.
కరీంనగర్ : హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్నే కాదు విజయభేరి సభను సమర్ధవంతంగా నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ వీటి నిర్వహణ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచింది. ఇక సిడబ్యూసి సమావేశాల తర్వాత కూడా కొందరు జాతీయస్థాయి నాయకులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలా కొందరు జాతీయస్థాయి నాయకులతో కలిసి ఏపిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి ఇంచార్జ్ గిడుగు రుద్రరాజు కరీంనగర్ లో పర్యటించారు.
హైదరాబాద్ తుక్కుగూడలో టిపిసిసి నిర్వహించిన సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన హామీలపై రుద్రరాజు స్పందించారు. బిఆర్ఎస్, బిజెపి మాదిరిగా నోటికొచ్చిన హామీలు ఇవ్వడం కాదు... సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించి అమలుకు సాధ్యమయ్యే హామీలను సోనియా ప్రకటించారని అన్నారు. ఆరు గ్యారంటీ అంశాలను ఎట్టి పరిస్థితుల్లో అమలుచేసి చూపిస్తామని రుద్రరాజు అన్నారు.
తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ చూసాక తెలంగాణ ప్రజల మూడ్ అర్థమయిపోయిందని రుద్రరాజు అన్నారు. బిఆర్ఎస్ ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టాలన్న పట్టుదలతో తెలంగాణ ప్రజానీకం వున్నారన్నారు. నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూసాక తెలంగాణలో 70కి పైగా సీట్లు కాంగ్రెస్ సాధిస్తుందని... అధికారంలోకి రావడం ఖాయమని అర్థమయ్యిందని రుద్రరాజు అన్నారు.
Read More తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా కల: సోనియా గాంధీ
తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ చేపట్టడంతోనే హామీలను విస్మరించడం మొదలయ్యిందన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఓ దళితుడిని చేస్తానన్న కేసీఆర్ రెండుసార్లు గెలిచి తానే ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. మంత్రి పదవుల్లోనే ఎవ్వరికీ న్యాయం జరగలేదని... కేవలం కేసీఆర్ కుటుంబం వద్దే కీలకమైన 14 మంత్రిత్వ శాఖలు ఉన్నాయన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తామన్న ప్రోత్సాహకాలు ఇప్పటివరకు ఇవ్వలేదని... దీంతో సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలా బిఆర్ఎస్ లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇస్తున్న ప్రతి హామీని అధికారంలో వచ్చాక నెరవేరుస్తుందని... ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో గ్యారంటీ కార్డులు ఇచ్చి అమలు చేస్తున్నామని రుద్రరాజు తెలిపారు.
'మహాలక్ష్మి' హామీ కింద కుటుంబ మహిళా పెద్దకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామనీ... ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామన్న హామీని రుద్రరాజు గుర్తుచేసారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.15000వేలు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రూ.12000వేలు ఇచ్చి తీరతామన్నారు.
'ఇందిరమ్మ ఇండ్లు' పథకం కింద భూమిలేని వారికి ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, 'యువ వికాసం' పథకం కింద విద్యార్థులకు రూ.5లక్షల విలువైన విద్యా భరోసా కార్డులు, కోచింగ్ ఫీజు సాయం చేస్తామన్నారు.ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు పించన్ రూ.4వేలకు పెంచుతామన్న కాంగ్రెస్ హామీలను రుద్రరాజు గుర్తుచేసారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతకాలు చేసిన హామీల గ్యారంటీ కార్డులను ఇంటింటికి ఇస్తున్నామని... అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నేత రుద్రరాజు తెలిపారు.