మీ వాగ్ధానాలు ఏమయ్యాయి:హైద్రాబాద్‌లో మోడీకి వ్యతిరేక పోస్టర్లు (వీడియో)
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసపర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారంనాడు తెలంగాణలో పర్యటించనున్నారు. హైద్రాబాద్, మహాబూబ్ నగర్ లలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సుమారు రూ.13,545 కోట్ల విలువైన పనులను మోడీ ప్రారంభిస్తారు.
వాట్ హ్యాపెండ్ యువర్ ప్రామిసెస్ ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏది అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఎక్కడ అని అడిగారు. మీ హామీలన్నీ నీటి మూటలేనా అంటూ ప్లెక్సీలు, పోస్టర్లు వేశారు. రావణసూరుడి తల, మోడీ బ్యానర్ ను ఏర్పాటు చేశారు.
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సమయంలో ఇదే తరహాలోనే పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఇచ్చిన హామీల గురించి ఈ పోస్టర్లు, ఫ్లెక్సీల్లో ప్రస్తావించారు.త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ పర్యటనకు ముందే ప్రధాని నరేంద్ర మోడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. శనివారం నాడు సామాజిక మాధ్యమంలో మోడీ విమర్శలు చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ఆయన విమర్శలు చేశారు. అసమర్థ బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పై కూడ ప్రజలు విశ్వాసంతో లేరన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు వంశపారంపరపార్టీలు అంటూ మోడీ వ్యాఖ్యానించారు.