2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్


2024 లో  కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రానుందని తెలంగాణ  సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం సోమవారం నాడు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. 

Anti BJP  Forces  Will Get Power after 2024 Elections In Center :KCR

నిజామాబాద్: 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వమే రానుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని  ఎన్నుకొంటే తెలంగాణ తరహలోనే దేశమంతా ఉచిత కరెంట్ అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.  దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఆలోచించాలని ఆయన  ప్రజలను కోరారు. లేకపోతే ఎవరైనా దెబ్బతింటారన్నారు.  దేశంలోని పరిస్థితులను అర్ధం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.

దేశం బాగుపడాలంటే  ఆరోగ్య కరమైన రాజకీయాలుండాలన్నారు. అహంకారంతో ప్రతిపక్షాలను చీల్చి చెండాడి ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనే ప్రభుత్వాలు కాదని చెప్పారు.సహనశీల విధానంతో ప్రజాస్వామ్య విధానంతో ముందుకు తీసుకెళ్లే లౌకిక శక్తుల రాజ్యం రావాల్సిన అవసరం ఉందనిఆయన అభిప్రాయపడ్డారు.ఇటీవలనే 28 రాష్ట్రాలకు చెందిన రైతులు తెలంగాణలో పర్యటించారని చెప్పారు. దేశ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు తనను ఆహ్వానించారని కేసీఆర్ గుర్తు చేశారు. 

తెలంగాణలో  రైతులకు  అమలౌతున్న పథకాలను రైతు సంఘాల నేతలు ప్రశంసించారన్నారు. దేశంలో కూడ  తెలంగాణ మాదిరిగా రైతులకు సౌకర్యాలు కల్పించేందుకు పోరాటం చేయాలని  రైతు సంఘాల నేతలు కోరిన విషయాన్ని కేసీఆర్ చెప్పారు. జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్ గడ్డ మీద నుండే ప్రారంభిస్తానని కేసీఆర్ ప్రకటించారు. 

పంట  భూములకు సాగు నీరందించేందుకు ఉద్దేశించిన కాలువల్లో  సింగూరు, గోదావరి నీళ్లు పారాలా?మతపిచ్చితో చెలరేగే నెత్తురు పారాలా తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్‌పీ పునరుజ్జీవంతో వచ్చే గోదావరి నీళ్లు కావాలో మతపిచ్చితో చెలరేగే మంటలు కావాలో ఆలోచించుకోవాలన్నారు.  ఒక్కసారి దేశం దెబ్బతింటే వందేళ్లు దాటినా కూడా కోలుకోదని కేసీఆర్ చెప్పారు.  భారతదేశం బాగుంటేనే మన రాష్ట్రం కూడ బాగుంటుందన్నారు.  మతపిచ్చితో, అప్రజాస్వామిక విధానాలతో అధికార దురంహకారంతో లంచగొండి విధానాలతో కుంభకోణాలతో పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టిన బీజేపీని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉందని కేసీఆర్  ప్రజలను కోరారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ జెండాను ఎగురవేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.  

త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయనున్నాయన్నారు. దేశంలో 24 గంటలు  విద్యుత్ ను ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని ఆయన గుర్తు చేశారు. దళిత బంధు పథకం కింద దళితులకు పది లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కేసీఆర్ గుర్తు చేశారు. 

also read:నిజామాబాద్ లో కేసీఆర్ టూర్: నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ భవనాల ప్రారంభం

నాటి నాయకత్వం చిన్న పొరపాటు చేస్తే మనం తెలంగాణ కోసం 60 ఏళ్లు కొట్లాడాల్సి వచ్చిందని సీఎం చెప్పారు.వలస పాలనలో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు అనేక నిరసనలు జరిగిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  గతంలో రెండు వందలు పెన్షన్ ఇస్తే  ఇప్పుడు రెండు వేల ఇస్తున్నామన్నారు.

రైతుల భూములను కార్పోరేట్ శక్తులకు అప్పగించే కుట్ర  బీజేపీ చేస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే ఎయిరిండియా, ఓడరేవులు, రైళ్లు, బ్యాంకులను ప్రైవేట్ శక్తులకు అమ్మేందుకు అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దేశం ఆశ్చర్యపడేలా సంక్షేమ పాలన సాగిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి రూ. 100 కోట్ల  నిధులను మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలోని మిగిలిన 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరో 10 కోట్లను అదనంగా మంజూరు చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios