హైదరాబాద్: ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలంగాణ రాష్ట్రానికి ముప్పు ఇంకా పొంచివుంది. మరో రెండ్రోజుల(గురు, శుక్రవారం) పాటు సాయంత్రం, రాత్రి సమయాల్లో అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధితో పాటు దాదాపు 17 జిల్లాలకు ఈ ఇంటెన్సివ్ స్పెల్స్ ప్రమాదం పొంచివుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగిందని... ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారిందని... దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఈ రెండింటి ప్రభావంతో రెండ్రోజులు జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు అకస్మాత్తుగా పడుతాయని తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. 

భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముంపుకు గురై ప్రాంతాల్లో ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ  వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రధానంగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.