తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్ నగర్ యువకుడి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. అయితే ఈ వ్యవహరంలో ట్విస్ట్ నెలకొంది. తండ్రి అక్రమ సంబంధంతో పాటు కుటుంబ కలహాలతోనే యువకుడిని కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఇందులో నరబలి కోణం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ సరూర్ నగర్‌లో యువకుడి కిడ్నాప్ కేసు ఊహించని మలుపు తిరిగింది. సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆస్తి తగాదాలతో పాటు అక్రమ సంబంధమే కిడ్నాప్‌కు కారణమని భావిస్తున్నారు. కిడ్నాప్ వెనుక స్థానిక కార్పోరేటర్ పాత్ర వుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కార్పోరేటర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రూ.12 కోట్ల ఆస్తి వివాదమే కిడ్నాప్‌కు కారణమని తెలుస్తోంది.
ALso Read:సరూర్‌నగర్ యువకుడి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. తెరపైకి తండ్రి ‘అక్రమ సంబంధం’
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా చింతపల్లికి తీసుకెళ్లి తనను నరబలి ఇచ్చేందుకు యత్నించారని చెప్పాడు. నా కిడ్నాప్ వెనుక కార్పోరేటర్ హస్తం వుందని అతను ఆరోపించాడు. ఇంట్లోకి వెళ్తుండగా తనను కొట్టి కారులో తీసుకెళ్లారని.. కారులో తనకు చిత్రహింసలు పెట్టారని సుబ్రహ్మణ్యం అన్నాడు. గంజాయి తాగి సిగరెట్లతో తన ఒంటిపై కాల్చారని.. తనను నరబలి ఇస్తామని స్నానం చేసి రావాలని పంపించారని, తనను చంపేందుకు యత్నిస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు రక్షించారని సుబ్రహ్మణ్యం చెప్పాడు. మొత్తం 12 మంది తనపై దాడి చేశారని అతను తెలిపాడు.
