తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ

First Published 24, Nov 2017, 1:03 PM IST
another setback to telangana sarkar high court asks for revised TRT notification
Highlights
  • సర్కారుపై గెలిచిన నిరుద్యోగులు
  • నిరుద్యోగల వాదన సరైందన్న ధర్మాసనం
  • టిఎస్పిఎస్సీకి దిమ్మ తిరిగే షాక్

తెలంగాణ సర్కారుకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సర్కారుకే కాకుండా ఏకపక్షంగా పోతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సైతం హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నిరుద్యోగుల పోరాటాల ఫలితంగా తెలంగాణ సర్కారు ఎట్టకేలకు తొలి డిఎస్సీ ప్రకటన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దానికోసం పెద్ద కసరత్తు చేసినట్లు బిల్డప్ ఇచ్చింది. నిపుణులతో చర్చలు అని, న్యాయ నిపుణుల సలహాలు అని... పకడ్బందీగా డిఎస్సీ వేస్తాం.. ఉత్తుత్త డిఎస్సీ కాదంటూ ఊదరగొట్టింది ప్రభుత్వం. అన్ని రకాల కసరత్తులు చేసి 8వేల పోస్టులకు డిఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దాని పేరు కూడా మార్చి టిఆర్ టి అని ముద్దుగా నామకరణం చేసింది. అయితే ఇక్కడ కావాలని వివాదం రాజేయాలన్న ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చిందా? లేక తెలియక ఇచ్చిందో కానీ 31 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపడతామని టిఎస్పిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడే సర్కారు తప్పులో కాలేసింది.

 సర్కారు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ మీద అభ్యర్థులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. 31 జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీ వల్ల తీవ్ర స్తాయిలో నష్టపోతామని వాదించారు. ఆందోళన చేశారు. రోడ్లెక్కారు. అయినా సర్కార్ డోంట్ ఖేర్ అన్నది. నోటిఫికేషన్ మార్చే ప్రశ్నే లేదని నిరుద్యోగల మొహం మీద చెప్పేసింది. దీంతో చేసేది లేక నిరుద్యోగులు కోర్టు తలుపు తట్టారు. హైకోర్టులో దీనిపై కేసులేయడంతో సర్కారు తాము ఎందుకు 31 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకున్నామో వివరించింది. కానీ సర్కారు వక్రబుద్ధి ఉందా? లేక కొత్త పాలన చేయాలనుకుందా ఏమోకానీ న్యాయం నిరుద్యోగుల వైపు నిలిచింది. న్యాయస్థానం తెలంగాణ సర్కారు వాదనలు తోసిపుచ్చి 31 జిల్లాల నోటిఫికేషన్ చెల్లుబాటు కాదని తీర్పు ఇచ్చింది. పాత 10 జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సవరించిన నోటిఫికేషన్ జారీ చేయాలంటూ టిఎస్పిఎస్సీకి హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కేజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. అయితే గడిచిన 40 నెలల కాలంలో ఈ దిశగా సర్కారు చేసిన ప్రయత్నాలేవీ జనాల్లో ఆదరణకు నోచుకోలేదు. 40 నెలల్లో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టును కూడా తెలంగాణ సర్కారు భర్తీ చేయలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సిఎం గా ఉన్న కాలంలోనే డిఎస్సీ జరిపి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. అయితే విభజన తర్వాత ఎపిలో ఒక డిఎస్సీ జరిపారు. రెండో డిఎస్సీకి సిద్ధమవుతున్నారు. కానీ తెలంగాణ రాగానే భారీగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తారన్న ఆశతో లక్షలాది మంది నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎదురుచూశారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. 40 నెలల్లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా సర్కారు కాలయాన చేసింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. డిఎస్సీ వేయాలన్న ఉద్దేశం తెలంగాణ సర్కారుకు ఏమాత్రం లేదని, కేవలం టైంపాస్ చేయడం కోసమే 31 జిల్లాల టిఆర్ టి వేశారని మండిపడుతున్నారు. 40 నెలలుగా టీచర్ పోస్టుల భర్తీ రేపు మాపు అంటూ జరపడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే సవరించిన నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు పోస్టుల సంఖ్యను పెంచి రెండు డిఎస్సీలను కలిపి ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

ఈ కేసుపై కోర్టులో జరిగిన వాదనలు ఇలా ఉన్నాయి...

పిటిషనర్‌ వాదన...

పాఠశాల విద్యా శాఖ అక్టోబర్‌ 10న జీవో నెంబర్‌ 25, అందుకు అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్‌ మరో ముగ్గురు వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణలోని పూర్వపు పది జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదముందని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఆమోదం లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది ఎస్‌.రాహుల్‌రెడ్డి వాదించారు. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలోని అభ్యర్థి పూర్వపు జిల్లాలో స్థానికేతరుడిగా నష్టపోతున్నారని చెప్పారు. 1976లోనే లోకల్‌ కేడర్‌ నిర్ధారణ జరిగిందని, కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాల్ని పరిగణనలోకి తీసుకోవడం చెల్లదన్నారు. పాలనా సౌలభ్యం కోసమే 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు కూడా కొత్త జిల్లాల్ని ప్రామాణికంగా తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. 

అడ్వొకేట్‌ జనరల్‌ వాదన...

31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ నియామకాల్ని సవాల్‌ చేసిన వ్యాజ్యంలో అంతిమంగా పిటిషనర్లు విజయం సాధిస్తే.. పూర్వపు పది జిల్లాలకే టీఆర్‌టీని వర్తింపజేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే జరిగితే దరఖాస్తుల స్వీకరణ గడువు 15 రోజులు పొడిగిస్తామని చెప్పారు. అభ్యర్థులు పది జిల్లాల్లో ఎక్కడి వారో తెలుసుకునేందుకు అధికారులకు ఇబ్బందేమీ లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే టీఆర్‌టీ నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేలా చూడాలని, పరీక్ష వాయిదా పడకుండా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహిస్తే స్థాని క అభ్యర్థులకు అన్యాయం జరగదని, రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లు కాదని ఏజీ వాదించారు.

loader