కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై కోడంగల్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదయ్యింది. ఆయనపై  341, 188, 506, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు.  

కొడంగల్ లో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు(డిసెంబర్ 4న) నియోజకవర్గ బంద్ కు  పిలుపునిచ్చిన విషయం తెలసిందే. గతంలో పరిస్థితులు, తాజా బంద్ పిలుపు నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ముందుగానే అప్రమత్తయ్యారు. సోమవారం, మంగళవారం రెండు రోజులు కొడంగల్ లో 144 సెక్షన్ విధించారు. ఈ రెండు రోజులు నిషేదాజ్ఞలు అమల్లో వుంటాయని పోలీసులు
ఉత్తర్వులు జారీ చేశారు.

ఇలా ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో  రేవంత్ పై మరో కేసు నమోదవడం రాజకీయంగానే కాకుండా ప్రజల్లో కూడా చర్చ మొదలైంది. ముందే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్, హరీష్ లు పోలీసులను ఉపయోగించుకుంటున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. అందువల్లే కేవలం కాంగ్రెస్ నాయకులైన తన అనుచరులపై మాత్రమై పోలీసులు దాడులు చేస్తున్నారని  ఇదివరకే రేవంత్ ఆవేధన వ్యక్తం చేశారు. తాజాగా ఆయనపై పోలీసులు మరో కేసు నమోదు చేయడం కొడంగల్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.