తెలంగాణలో ఒకవైపు పాలకులు బంగారు తెలంగాణ మాటలతో మభ్య పెడుతున్నారు. కానీ నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయా అని ఆందోళనతో గుబులు పడుతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉస్మానియాలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా ఉస్మానియాలో ఉన్నత చదవులు చదివిన సూర్యాపేట జిల్లా వాసి తమ పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఎంఏ తెలుగు, నెట్, సెట్, బిఇడి ఉండి కూడా జెఎల్/డిఎల్  నోటిఫికేషన్లు రాక తీవ్ర నిరాశకు గురయ్యాడు వెంకటరమణ. అన్ని అర్హతలు ఉండి కూడా, నిత్యం నిరుద్యోగిగా అవమానాలు పడలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామానికి చెందిన ఓయూ విద్యార్థి నిరుద్యోగి వెంకటరమణ అదే గ్రామంలోని ఒక ఎడ్ల కొట్టంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఓయు విద్యార్థి ఆత్మహత్య ఘటన సూర్యాపేట జిల్లాలోనే కాకుండా తెలంగాణ అంతటా దావాలనం లా వ్యాపించింది. నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దెబ్బలో లక్ష ఉద్యోగాలు ఇస్తానని మాటలు చెప్పిన ప్రభుత్వం నాలుగేళ్లలో సగం కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు.