హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో కిడ్నాప్ జరిగింది. మంగళవారం సాయంత్రం ఈ పోలీసు స్టేషన్ పరిధిలోనే డాక్టర్ కిడ్నాపైన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రకు చెందిన గౌస్ అనే వ్యక్తి కిడ్నాప్ నకు గురయ్యాడు. 

అతనికి రాజేంద్ర నగర్ లో మొదటి భార్య ఉంది. ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో అక్కడి నుంచి అతను హైదరాబాదు మకాం మార్చినట్లు తెలుస్తోంది. మొదటి భార్య బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారని రెండవ భార్య రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బావమరుదులే గౌస్ ను కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తంచేసింది. 

ఇదిలావుంటే, హైదరాబాదులో కిడ్నాపైన వైద్యుడిని అనంతపురం జిల్లా పోలీసులు రక్షించారు. వైద్యుడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకుని వెళ్తుండగా అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాదులోని హిమాయత్ సాగర్ దర్గా సమీపంలో డాక్టర్ బెహజాట్ హుస్సేన్ ను దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. 

పక్కా పథకం ప్రకారం బుర్కాలు వేసుకుని వైద్యుడిని అతని కారులోనే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారు. ఈ సంఘటన మంగళవారంనాడు చోటు చేసుకుంది. అయితే, పక్కా సమాచారంతో అనంతపురం జిల్లా పోలీసులు కారును గుర్తించారు. 

ఇద్దరు కిడ్నాపర్లు ప్రస్తుతం అనంతపురం జిల్లా రాప్తాడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు పారిపోయినట్లు సమాచారం. వైద్యుడి కిడ్నాప్ సమాచారం నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు. 

కిడ్నాప్ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.