తెలంగాణలో మరో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు.. ఎల్బీనగర్ లో ఘటన...
తెలంగాణ లో ఎలక్ట్రికల్ బైక్ లో మంటలు చెలరేగుతున్న వరుస సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఎల్బీ నగర్ లో పార్క్ చేసిన ఎలక్ట్రికల్ బైక్లో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ : తెలంగాణలో మరో Electric bike లో మంటలు లేచాయి. రాష్ట్ర రాజధాని LB Nagar చౌరస్తాలో ఓ ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి. ఓ Delivery boy ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతి అయింది. డెలివరీ బాయ్ ఆర్డర్ పికప్ చేసుకుని వచ్చే సరికి అతని ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు లేచాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు లేచాయి. పెద్ద యెత్తున లేచిన మంటలకు అక్కడివారు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ లో అగ్నికి ఆహుతి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల కిందట కరీంనగర్ లో ఇలాగే ఓ ఎలక్ట్రిక బైక్ తగలబడింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలింది. వివరాలు.. ఎగుర్ల ఓదెలు రెండు నెలల క్రితం బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారు.
ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పడుకునే ముందు బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. అయితే చార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాటరీలో పేలుడు సంభవించింది.
అయితే అదృష్టవశాత్తూ.. ఇంటి బయట బ్యాటరీని ఛార్జింగ్ పెట్టడం.. పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదంతప్పింది. కాకపోతే, ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఇక, గత నెలలో నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ఒకరు మృతి చెందాడు. ఎలక్ట్రిక్ బైక్ పేలడంతో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ వివరాల్లోకి వెడితే..బల్లా ప్రకాష్ అనే వ్యక్తి తన కుమారులు, తల్లిదండ్రులతో కలిసి సుభాష్ నగర్‌లో నివసిస్తున్నాడు. సంవత్సరంన్నర క్రితం ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. బండి నుంచి బ్యాటరీని తీసేసిన తర్వాత.. ఇంట్లో పెట్టి క్రమం తప్పకుండా ఛార్జ్ చేసేవాడు. అలాగే ఆ రోజు కూడా మెయిన్ హాల్‌లో బ్యాటరీని ఛార్జింగ్ పెట్టాడు.
అక్కడ ఆ రోజు ప్రకాష్ కుమారుడు కళ్యాణ్, తల్లిదండ్రులు రామస్వామి, కమలమ్మలు పడుకున్నారు. ప్రకాష్, అతని భార్య కృష్ణవేణి మరో రూమ్‌లో నిద్రపోయారు. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. పేలుడు శబ్దం విని ప్రకాష్ హాలులోకి వచ్చాడు. పేలుడు కారణంగా మంటలు, పొగ హాలును కమ్మేశాయి. దీంతో వారంతా ఒక్క ఉదుటన ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడులో హాలులో పడుకున్న ప్రకాశ్ తల్లిదండ్రులు, కుమారుడికి గాయాలయ్యాయి.
గాయపడిన ముగ్గురిని వెంటనే నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 80 ఏళ్ల రామస్వామి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. తీవ్ర గాయాలపాలైన రామస్వామి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రకాష్ ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.