వరంగల్ జిల్లాలో మరో ఘరానా మోసం చోటుచేసుకుంది. కల్పవల్లి ఫైనాన్స్ ట్రేడర్స్ చిట్టీల పేరుతో కోట్ల రూపాలయు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. చిట్టీలు కడుతున్నవారికి చెందిన డబ్బులతో కల్పవల్లి ఫైనాన్స్ ట్రేడర్స్ సంస్థ యజమాని పారిపోయాడు.
వరంగల్ జిల్లాలో మరో ఘరానా మోసం చోటుచేసుకుంది. కల్పవల్లి ఫైనాన్స్ ట్రేడర్స్ చిట్టీల పేరుతో కోట్ల రూపాలయు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. చిట్టీలు కడుతున్నవారికి చెందిన డబ్బులతో కల్పవల్లి ఫైనాన్స్ ట్రేడర్స్ సంస్థ యజమాని పారిపోయాడు. వివరాలు..లేబర్‌కాలనీకి చెందిన మూడెడ్ల వెంకటేశ్వర్లు గత పదేళ్లుగా చిట్టీల నిర్వహిస్తున్నారు. అతడి మాటలు నమ్మి చాలా మంది అతని వద్ద చిట్టీలు వేశారు. చాలా కాలంగా చిట్టీల నిర్వహణ సక్రమంగా ఉండడంతో పలువురు వడ్డీ ఆశతో పెద్ద మొత్తంలో డబ్బులు జమచేశారు.
అయితే కొంతకాలంగా చిట్టీలు ఎత్తుకున్నవారికి డబ్బులు చెల్లింపులో జాప్యం జరుగుతూ వస్తుంది. దీంతో చిట్టీలు కట్టినవారు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఈ క్రమంలోనే చిట్టీలు కట్టినవారి డబ్బులతో వెంకటేశ్వర్లు పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు లేబర్ కాలనీలో ఉన్న అతని ఆఫీసు వద్దకు చేరుకున్నారు. ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అయితే వెంకటేశ్వర్లు వద్ద దాదాపు 600 మంది చిట్టీలు కట్టినట్టుగా తెలుస్తోంది. బాధితుల వద్ద నుంచి మొత్తం రూ. 28 కోట్ల వరకు మోసం చేశాడని చెబుతున్నారు. చాలా మంది పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవడం కోసం.. ఆయన వద్ద చిట్టీలు వేసినట్టుగా తెలిపారు.
