Asianet News TeluguAsianet News Telugu

మంత్రి ఈటలకు మల్లా దెబ్బ.. ఎందుకబ్బా?

  • పోచంపాడు రైతు సభలో మాట్లాడని ఈటల
  • రాజకీయ వర్గాల్లో విస్మయం
  • సభ బాధ్యతలిచ్చి వేదిక మీద మాట్లాడకపోవడమేంటని ప్రశ్న
  •  
Another blow to the minister etala rajendar

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కు మరో దెబ్బ తగిలింది. సర్కారులో ఆయనపై చిన్నచూపు ఉన్నట్లు గతంలోనే ఏసియయానెట్ ఒక ప్రత్యేక కథనం రాసింది. అయితే అదే చిన్నచూపు పరంపర కొనసాగుతున్నట్లు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగి వారం రోజులవుతున్నా ఇంకా బర్నింగ్ ఇష్యూగానే టిఆర్ఎస్ కేడర్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకూ ఆ మరో దెబ్బ ఏమిటబ్బా అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.

ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఆ నలుగురి తర్వాత స్థానంలో నిలుస్తారు. పార్టీలో సిఎం కెసిఆర్ తర్వాత మొదటి మూడు స్థానాల్లో ఆయన కుటుంబసభ్యుల ర్యాంకు ఉంటుందని చెబుతారు. ఆ తర్వాత స్థానం ఈటలదే. అంటే టిఆర్ఎస్ పార్టీలో ఈటల స్థానం ఐదో ప్లేస్ ఉండొచ్చని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటారు. మరి అలాంటి ఈటలకు ఇటీవల కాలంలో ఎందుకు చిన్నచూపు మొదలైందన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

మొన్నటికి మొన్న జిఎస్టీ సమావేశానికి ఈటెలను కాదని సిఎం తనయుడైన మంత్రి కెటిఆర్ ను ప్రభుత్వం ఢిల్లీ పంపింది. దీనిపై రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. తీరా సర్కారు మంత్రి ఈటల చేత ఒక వివరణ ఇప్పించింది. ఎవరు పోతే ఏముంది? ఎవరైనా ప్రభుత్వ విధానం చెప్పాల్సిందే కదా? దీనిలో రాజకీయాలకు చోటు లేదంటూ ఈటల ఒక విలేకరుల సమావేశం పెట్టి చెప్పారు. కానీ జనాల్లో మాత్రం ఇంకా అనుమానాలు తొలగిపోలేదు.

అయితే ఈనెల 10వ తేదీన పోచంపాడు ప్రాజెక్టు పునరుజ్జీవ సభను సర్కారు అట్టహాసంగా జరిపింది. దానికి ప్రజా సమీకరణ బాధ్యతలు ఈటల భుజానికెత్తింది తెలంగాణ ప్రభుత్వం. జిఎస్టీ సమావేశాలకు పంపకుండా ఈ సభ ముఖ్యమైనదని, అందుకే ఈటలను బాధ్యతలిచ్చినట్లు చెప్పింది. కానీ సభ జరిగిన తీరు చూస్తే జనాల్లో, టిఆర్ఎస్ కేడర్ లో ఒక అనుమానం బలంగా ఉంది. అదేమంటే అంతటి ప్రాధాన్యత ఉన్న సభలో, బాధ్యతలన్నీ భుజాన ఎత్తుకున్న ఈటలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడమే.

పునరుజ్జీవ సభలో సిఎంతోపాటు మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు మాట్లాడారు. కానీ బరువు బాధ్యతలు మోసిన ఈటల రాజేందర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడడం చర్చనీయాంశమైంది. నిజానికి సభ ఏర్పాట్లు మొదలు విజయవంతం చేయడం వరకు ఈటల ముందుండి పనిచేశారు. అక్కడ మకాం వేసి పర్యవేక్షించారు. ఇంతటి కీలక బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఆయనను ఎందుకు సభలో ఒక్క మాట మాట్లాడనీయలేదన్న అనుమానాలు కార్యకర్తల్లో నెలకొన్నాయి.

అయితే మరోవాదన కూడా వినిపిస్తున్నది. అప్పటికే సభలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడినందున ఎండ తాకిడి తీవ్రంగా ఉండడంతో ఈటలను మాట్లాడనీయలేదని చెబుతున్నారు. జనాలు వెళ్లే మూడ్ లో ఉన్నందున వెంటనే సిఎం మాట్లాడినట్లు చెబుతున్నారు. సిఎం సభలో ఎండ ఇసిరి ఇసిరి కొడుతున్నది... అయినా కొద్దిగా ఓపికతో ఉండాలంటూ జనాలను ఉద్దేశించి కామెంట్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి పార్టీలో, ప్రభుత్వంలో ఈటల విషయంలో ఏదో జరుగుతుందన్న అనుమానం వెలిబుచ్చుతూ అన్ని రాజకీయ పార్టీల్లో చర్చలు మాత్రం జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios