హైదరాబాద్: అంగన్ వాడీలకు తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా కానుక అందజేయనున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోషియేషన్ అధ్యక్షురాలు భిక్షపమ్మ ఆధ్వర్యంలో సంఘం నేతలు మంత్రి సత్యవతి రాథోడ్ తో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా అంగన్ వాడీ టీచర్లు, మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు జీతాలు లేక ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికీ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు. 

అంగన్ వాడీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారని, వేతనాలపైనే ఆధారపడి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. జీతాలు పడితేనే వారు పండుగ చేసుకుంటారని లేకపోతే పండుగ చేసుకోలేని పరిస్థితి అని మంత్రికి వివరించారు. 

అంగన్ వాడీల సమస్యలు విన్న మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అంగన్ వాడీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్ వాడీలకు వేతనాలు పెంచారని గుర్తు చేశారు. 

అంగన్ వాడీ టీచర్లు, మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు దసరా పండగకు వేతనాలు ఇప్పించే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలల వేతనాలు రావాల్సి ఉందని, ప్రతి నెల నెల చివర్లో వేతనాలు ఇస్తున్నారని, పండగ ఉన్నందున నెలాఖరులో వేతనం ఇస్తే ఇబ్బంది ఉంటుందని, త్వరగా ఇప్పించాలంటూ వారు  కోరారు.  

అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న అంగన్ వాడీ భవనాల కిరాయిలు, వంట బిల్లులు , టీఏ, డీఏల బిల్లులు ఇప్పించాలని కోరారు. అలాగే 2014 ప్రకారం వంట బిల్లులు ఇస్తున్నారని, పెరిగిన ధరల మేరకు ఈ బిల్లులు పెంచాలని కోరారు.

సిఎం కేసిఆర్ గారి నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా అంగన్ వాడీలు పనిచేయాలని సూచించారు. అంగన్ వాడీలకు వచ్చే పిల్లలను తల్లుల్లా చూసుకోవాలని, మీ సమస్యల తీర్చే పని నేను తీసుకుంటానని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.

ఉద్యోగులు బతుకమ్మ ఆటలు ఆడుకునేందుకు మధ్యాహ్నం నుంచి వెసులుబాటు కల్పించాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి  నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. బతుకమ్మ ఆడుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.