అంగన్వాడీలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటే జీతాలు పెంచనున్నట్లు సమ్మె చేపట్టిన అంగన్వాడీలకు మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీల ఆందోళలతో దిగివచ్చింది. కొంతకాలంగా తమ జీతాలు పెంచడంతో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అంగన్వాడీలతో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్థిక మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చడంతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలపై హామీ ఇచ్చారు. మిగతా సమస్యల పరిష్కారానికి కూడా మంత్రులు సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ జేఏసి ప్రకటించింది.
తమ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంగన్వాడీల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమతో చర్చలు జరిపి ప్రభుత్వం తరపున సానుకూల నిర్ణయం తీసుకున్న మంత్రులు హరీష్, సత్యవతి రాథోడ్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెను విరమించి ప్రతి ఒక్కరు విధులకు హాజరుకావాలని అంగన్వాడీ టీచర్స్ ఆండ్ హెల్పర్స్ జేఏసి సూచించింది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్ల నాయకులు హైదరాబాద్ లోని మంత్రి హరీష్ నివాసానికి వెళ్లి కలిసారు. ఈ సందర్భంగానే పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వారికి హరీష్ తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటే అంగన్వాడీల జీతభత్యాలు కూడా పెరుగుతాయని మంత్రి తెలిపారు. అలాగే మిగతా సమస్యలను కూడా పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు.
Read More హ్యాట్రిక్ విజయంతో మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. : మంత్రి కేటీఆర్
అంగన్వాడీల ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై తొందర్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మిగిలిన డిమాండ్లపై నివేదికను సమర్పించవలసిందిగా మహిళా శిశు సంక్షేమ సెక్రెటరీని భారతి హోలికేరిని మంత్రి ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో సంబంధిత ఖాతాల్లో అంగన్వాడీ మద్యాహ్న భోజన బకాయిలు చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.
