కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్. షర్మిల: లోటస్ పాండ్‌లో విజయమ్మతో జగన్ భేటీ
హైద్రాబాద్ లోటస్ పాండ్ లో వై.ఎస్. విజయమ్మతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు.
హైదరాబాద్: రెండేళ్ల తర్వాత హైద్రాబాద్‌లోని లోటస్ పాండ్ లోని నివాసానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారంనాడు వచ్చారు. 2018 తర్వాత ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి షిఫ్ట్ అయిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైద్రాబాద్ లోటస్ పాండ్ కు రెండోసారి వచ్చారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించేందుకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చారు. హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీతో విశ్రాంతి తీసుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం కేసీఆర్ నివాసం నుండి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ కు వచ్చారు. తల్లి వై.ఎస్. విజయమ్మతో భేటీ అయ్యారు.
also read:కేసీఆర్‌కు జగన్ పరామర్శ: లంచ్ భేటీ
యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ)ని వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ ప్రక్రియ కోసం వై.ఎస్. షర్మిల నిన్న రాత్రే న్యూఢిల్లీకి వెళ్లారు. నిన్న సాయంత్రమే వై.ఎస్. షర్మిల తన కొడుకు పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఈ ఆహ్వాన పత్రికను అందించిన తర్వాత గన్నవరం నుండి ఆమె న్యూఢిల్లీకి వెళ్లారు.ఇవాళ వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజునే వై.ఎస్. విజయమ్మతో జగన్ భేటీ అయ్యారు. హైద్రాబాద్ వచ్చిన సందర్భంగా జగన్ విజయమ్మతో భేటీ అయినట్టుగా చెబుతున్నారు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరిన రోజే ఈ భేటీ జరగడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ కు రావడం తగ్గించారు. 2018 తర్వాత రెండు సార్లు మాత్రమే లోటస్ పాండ్ కు వచ్చినట్టుగా చెబుతున్నారు. సినీ నటుడు కృష్ణ మరణించిన సమయంలో హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో లోటస్ పాండ్ కు వచ్చారు. అంతకు ముందు ఒక్కసారి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇవాళ జగన్ లోటస్ పాండ్ కు వచ్చిన సమయంలో వై.ఎస్. షర్మిల న్యూఢిల్లీలో ఉన్నారు.