తెలుగు రాష్ట్రాల్లో ఎండలతోపాటు వానలు కూడా కురుస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తేలికపాటి వర్షాలు, వడగాల్పులు ఉంటాయి.
Weather : తెలుగురాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు వానలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే... సాయంత్రం అయ్యిందంటే చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతోంది. ఈ రెండ్రోజులు కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణ వాతావరణ సమాచారం :
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పగటిపూట ఎండలు యదావిధిగా కొనసాగుతాయని... సాయంత్రంపూట ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసారు.
ఏప్రిల్ 28 అంటే సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటలకు 50 నుండడి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
ఇక నిజామాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందట... దీంతో ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ఇక మిగతాజిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పగటిపూట 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఎండలు కూడా మండిపోతాయని... వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుందని హెచ్చరించింది.
