హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి రెండు రాష్ట్రాల కోసం వినియోగించుకోవాలనే ప్రతిపాదనపై వెనక్కి తగ్గాయి రెండు రాష్ట్రాలు. తమ స్వంత ప్రాజెక్టుల నిర్మాణం కోసం రెండు రాష్ట్రాలు ప్రతిపాదనలు చేస్తున్నాయి.

గోదావరి నది నీటిని కృష్ణా నదిని మళ్లించి రెండు రాష్ట్రాల్లో అవసరమైన ప్రాంతాలకు తరలించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గతంలో ప్రతిపాదించాయి. 

ఈ మేరకు గత ఏడాదితో పాటు ఈ ఏడాది జనవరి మాసంలో జరిగిన ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, జగన్ ల మధ్య చర్చ జరిగింది. ఈ విషయమై రెండు రాష్ట్రాల ఇంజనీర్లు చాలా ప్రాంతాల్లో సర్వేలు కూడ నిర్వహించాయి.  కానీ, ఉమ్మడి ప్రాజెక్టు నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలు వెనక్కు తగ్గాయి.

also read:ఇరిగేషన్ ప్రాజెక్టుల చిచ్చు: ఏపీ, తెలంగాణ వాదనలు ఇవీ..

తెలంగాణతో కలిసి ఏపీ రాష్ట్రం ఉమ్మడి ప్రాజెక్టుకు ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఏపీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదనే అభిప్రాయంతో ఈ ప్రాజెక్టు  విషయంలో ఏపీ వెనక్కు తగ్గిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  గోదావరి నీటిని శ్రీశైలం, సాగర్ నుండి ఏపీకి తరలించాలని తొలుత ప్రతిపాదించాయి. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య స్నేహాపూర్వక సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని చెప్పలేం.  దీంతో రెండు రాష్ట్రాలు తమ స్వంత ప్రాజెక్టులకు సిద్దమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్లాన్ ఇదీ

గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను సిద్దం చేసింది. పోలవరం నుండి కర్నూల్ లోని బనకచర్లలోని హెడ్ రెగ్యులేటరీ వద్దకు తరలించనున్నారు. ఇక్కడి నుండి రాయలసీమకు గోదావరి నీటిని తరలించాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. అంతేకాదు రాయలసీమతో పాటు పెన్నా బేసిన్ కు కూడ ఈ నీటిని తరలించనున్నారు. 

గోదావరి నది జలాల్లో సుమారు 210 టీఎంసీల నీటిని తరలించాలని ప్రతిపాదిస్తోంది ఏపీ. ప్రతి రోజూ 2 టీఎంసీల నీటిని తరలించేలా ఏపీ ప్లాన్ చేసింది. గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల స్టోరేజీ కేపాసిటితో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.

తెలంగాణ ప్లాన్

కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మిడ్ మానేరు రిజర్వాయర్ కు ప్రతి రోజూ 3 టీఎంసీల నీటిని తరలించనున్నారు. దీంతో బస్వాపూర్ రిజర్వాయర్  కాలేశ్వరం నీటితో నింపుతారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుండి శామీర్ పేట , మూసీ రివర్, ఆసిఫ్ నెహర్ , పానగల్  నుండి పెద్ద దేవులపల్లికి గోదావరి నీటిని తరలించనున్నారు. ఇక్కడి నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి తరలిస్తారు. కృష్ణా  నదికి వరద లేని రోజుల్లో గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసింది.