తెలంగాణ యాసతో  యాంకర్ గా ఆకట్టుకొని.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంటరయ్యి.. తన గురించి అందరికీ తెలిసేలా చేసిన యాంకర్ కత్తి కార్తీక ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది. త్వరలో సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ నియోజకవర్గంలో పోటీ చేయలాని కత్తి కార్తీక భావిస్తోంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉండనున్నట్లు  కార్తీక తెలిపారు. అందుకు ఆమె సన్నద్ధమవుతున్నారు.2 రోజులుగా దుబ్బాకలో తిరుగుతూ, వివిధ సంఘాల నాయకులతో సమాలోచనలు చేపడుతున్నారు. యువజన సంఘాలు ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు చేరుకుని యువతతో మాట్లాడుతున్నారు. 

కాగా.. మంగళవారం ఆమె దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సరదాగా గడిపింది. దుబ్బాక మున్సిపాలిటీలోని అన్ని మండపాలను సందర్శించి, పూజలు చేశారు.

అనంతరం మీడియాతో కత్తి కార్తీక యువత భక్తి భావంతో విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషించతగ్గ అంశమని కొనియాడారు. సమాజంలో ఉన్న చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరించాలని యువతకు సూచించారు. ఈ సందర్భంగా వచ్చే దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. నాకు మద్దతు ఇచ్చి MLAగా గెలిపిస్తే ఒక సైనికురాలిగా సేవాభావంతో పని చేస్తానని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

కాగా.. కత్తి కార్తీక పలు టీవీల్లో యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కూడా కార్తీక పాల్గొన్నారు. ఇదిలా ఉండగా..దుబ్బాక నియోజకవర్గాన్ని మళ్లీ దక్కించుకోవాలని టీఆర్ఎస్ చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.