అనంతపురం: కూకట్ పల్లిలో ప్రజా కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని విజయం కోసం అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. ఆమె తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

కొద్ది రోజులుగా అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నేతలు కూకట్‌పల్లిలో ఉంటూ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.  మంత్రి పరిటాల సునీత రెండు రోజుల పాటు కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. 

శాసనమండలి చీఫ్‌విప్‌, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ కూకట్ పల్లిలోనే మకాం వేశారు. ఆయనతో పాటు అనంతపురం శాసనసభ్యుడు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, కదిరి ఎమ్మెల్యే అత్హార్‌ చాంద్‌బాషా, టీడీపీ ఎన్నికల ప్రచార ఇంచార్జిలుగా వ్యవహరిస్తున్నారు. గత వారం రోజులుగా కూకట్‌పల్లిలోనే మకాం వేసి వారు ప్రచారం చేస్తున్నారు. 

కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు, న్యాయవాది ఆదెన్న, నగర తెలుగు యువత అధ్యక్షుడు లింగారెడ్డి, మణి తదితరులు ప్రచారం సాగించారు.