శశాంక్ రామానుజం దర్శకత్వం వహించిన 'అమ్మాయి' లఘు చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఐపిఎస్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మహిళలు తమను తాము ఎలా కాపాడుకోవాలో, తమతో మిస్ బిహేవ్ చేసేవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చక్కగా చిత్రీకరించింది. మహిళపై పురుషుడు దాడి చేసినప్పుడు తనకోసం తాను ఎలా ప్రతిఘటించాలో ఎంత శక్తివంతురాలో కావాలో చెబుతోందీ ఫిల్మ్.

మహిళలు ధైర్యంగా ఉండటం, ఆత్మరక్షణ విధానాలు నేర్చుకోవడం ద్వారా స్ట్రాంగ్ లా ఉండగలుగుతారు. ఇదివరకు బ్యూటిఫుల్ లైఫ్ ,మరోలోకం చిత్రాలు చేసిన దర్శకుడు శశాంక్ రామానుజన్ తీసిన ఈ సామాజిక చైతన్య లఘుచిత్రాన్ని మహేష్ భగవత్ ప్రశంసించారు. ఇందులో నటించిన నటుల ప్రతిభను మెచ్చుకున్నారు. షార్ట్ ఫిల్మ్ ద్వారా వారు చాలా గొప్ప సందేశం ఇచ్చారన్నారు. ఆపద సమయంలో ఎవరైనా వచ్చి రక్షిస్తారని ఎదురుచూడకుండా తమను తాము రక్షించుకోవాలని మహిళలను కోరారు.

 

"

 రాచకొండకు చెందిన 1000 మంది మహిళా పోలీసు క్యాడెట్లకు యుద్ధ కళారూపమైన కలరిపాయట్టు నేర్పిన విషయాన్ని ఈ సమయంలో ఆయన ఉదహరించారు.

పోలీసులు ఎప్పుడూ మహిళల రక్షణ కోసం ఉంటారని, డయల్ 100తో రాచకొండలో కేవలం ఏడున్నర నిమిషాల్లో స్పందిస్తామని అన్నారు. అయితే పోలీసులు వచ్చే వరకు తమను తాము కాపాడుకునేలా మహిళలు ధైర్యంగా ఉండాలన్నారు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడు దేశానికి నిజమైన స్వతంత్ర్యం అని చెప్పిన మహాత్మా గాంధీని ఉటంకిస్తూ, రాచకొండ పోలీస్ ఏర్పడినప్పటి నుంచీ షీ ఫర్ హర్, మార్గదర్షక్ కార్యక్రమాల గురించి సిపి తెలిపారు. 

2020లో మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందని, అనేక ఫిర్యాదులు అందాయని అన్నారు. ఇది నెగెటివ్ విషయమే అయినా పోలీసులపై మహిళలపై విశ్వాసం పెరగడానికి సంకేతంగా దీనిని భావిస్తున్నామన్నారు. ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. అప్పుడే నేరస్తులు పట్టుబడతారు, దారుణాలను ఆపగలం అన్నారు. ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా సరే 100 డయల్ చేయమని సిపి మహిళలకు తెలిపారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలని తల్లిదండ్రులకు తెలిపారు. 

ఈ సందర్భంగా నటి సనా 25 లఘు చిత్రాలు చేసిన శశాంక్‌ను అభినందించారు. త్వరలోనే మంచి బ్రేక్ త్రూ రావాలని కోరుకున్నారు. ఇలాంటి చక్కటి సామాజిక సందేశంతో కూడిన సినిమాలు చేయడానికి ప్రేరణ, చోదక శక్తిగా సహకరించిన సిపి మహేష్ భగవత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

దర్శకుడు శశాంక్ మాట్లాడుతూ తన 25 వ షార్ట్ ఫిల్మ్ టీంను, చూడడానికి వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. సిపి మహేష్ భగవత్ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో నటించిన నటులు రీమా, గౌతమి, బేబీ హసిని తదితరులను సిపి రాచకొండ మహేష్ భగవత్ ఐపిఎస్, నటి సనా సత్కరించారు. 

డిసిపి మల్కాజ్గిరి రక్షా మూర్తి ఐపిఎస్, అదనపు డిసిపి షీ బృందాలు శ్రీమతి సలీమా, ఆర్కెఎస్సి వైస్ చైర్మన్ గుణాలన్, ఆర్కెఎస్సి కార్యదర్శి వి.సతీష్, ఎడిసిపి అడ్మిన్ శిల్పవల్లి, షార్ట్ ఫిల్మ్ నిర్మాత సత్యనారాయణ, మహిళా ఇన్స్పెక్టర్లు, షీ టీం ఆఫీసర్లు, ఈ సినిమా ప్రదర్శనలో పాల్గొన్నారు.