Asianet News TeluguAsianet News Telugu

పటేల్ కృషితో నిజాం పాలన నుంచి విముక్తి.. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి: అమిత్ షా

సర్దార్ పటేల్ కృషి వల్ల నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలు విముక్తి పొందారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
 

amit shah speech in telangana liberation day celebration Secunderabad Parade Grounds
Author
First Published Sep 17, 2022, 10:40 AM IST

నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆగడాలు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రజాకార్లు అనేక గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలిపారు. సర్దార్ పటేల్ కృషి వల్ల నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలు విముక్తి పొందారని చెప్పారు. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండ్, కర్ణాటక రవాణాశాఖ మంత్రి బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జలియన్‌వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందని అన్నారు. సర్దార్ పటేల్ చొరవతో పోలీసు చర్య తీసుకోవడం వల్లే తెలంగాణ విముక్తి సాధ్యమైందని అన్నారు. ఆనాడు 109 గంటల పాటు సైనిక చర్య అవిశ్రాంతంగా జరిగిందన్నారు. పటేల్ లేకుంటే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేదని అన్నారు.  

తెలంగాణకు, కర్ణాటక, మహరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదని అన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలను జరపలేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. ఏ భయం లేకుండా వేడుకలను చేసుకోవాలని ప్రజలను కోరుతున్నట్టుగా చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios