చాలా రోజుల విరామం తర్వాత తెలంగాణలో పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ దఫా టూర్‌లో పెద్ద స్కెచ్‌తోనే దిగుతున్నట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల గురించి విస్తృతంగా చర్చ జరుగుతండటానికి తోడు.. తెలుగు రాష్ట్రాలపై కమలం ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇక అమిత్ షా పర్యటన మొత్తానికి హైలెట్ పాయింట్ ఈనాడు అధినేత రామోజీరావుతో భేటీ. ‘సంపర్క్‌ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల ప్రముఖులను కలిసి తమ ప్రభుత్వ విజయాలను వివరించి.. వచ్చే ఎన్నికల్లో మద్ధతు ఇవ్వాలని కోరడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. దీనిలో భాగంగానే రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావుతో అమిత్ షా సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి నేటీ వరకు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు రామోజీ.. టీడీపీని ఆపత్కాలంలో ఆదుకుని.. ఎన్నో సమస్యలను పరిష్కరించి ‘రాజగురువుగా’ మన్ననలు అందుకున్నారు రామోజీరావు. 

తెలుగుదేశానికి అత్యంత ఆప్తుడైన వ్యక్తితో అమిత్ షా భేటీ కావడం ఇరు పార్టీల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత.. బీజేపీపైనా, మోడీపైనా చంద్రబాబు దూకుడుగా వెళ్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చెప్పింది ఎన్నడూ కాదనని రామోజీరావు.. అమిత్‌షాతో ఏం మాట్లాడారు..షా ఆయనకి ఏం చెప్పారు.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. కాకపోతే తొలి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకవాదిగా ముద్రపడ్డ రామోజీ.. బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు.

ఇక ముందు కూడా ఆయన అదే విధానం కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లినట్లు కానీ.. ఈనాడు మీడియాలో కమలాన్ని వ్యతిరేకిస్తూ ఎలాంటి వార్తలు రాలేదు.. దీన్ని బట్టి రామోజీ నుంచి కొత్తగా మద్ధతు సంపాదించాల్సిన అవసరం లేదు. మరి అమిత్ షా ఎందుకు ఫిల్మ్‌సిటీకి వెళ్లినట్లు.. ఇదే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులను ఆందోళనలోకి నెట్టింది. 

ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. అన్నట్లు ‘సంపర్క్ ఫర్ సమర్థన్‌’‌లో భాగంగా అమిత్ మరో ఇద్దరు తెలుగు ప్రముఖులను కూడా కలవనున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, టీవీ9 అధినేత శ్రీనిరాజుతోనూ ఆయన భేటీ అవుతారు.