తెలంగాణపై ఫోకస్: నేతల మధ్య కోల్డ్ వార్ పై సీరియస్, అమిత్ షా క్లాస్
తెలంగాణపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టారు. ఇవాళ పార్టీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు.
హైదరాబాద్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశా నిర్ధేశం చేశారు.గురువారంనాడు మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ శంషాబాద్ లోని ఓ హోటల్ లో రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. 2024 ఏప్రిల్ లో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై ముఖ్య నేతలతో అమిత్ షా చర్చించారు.
పార్టీకి చెందిన రాష్ట్ర నేతల కోల్డ్ వార్ పై అమిత్ షా కేంద్రీకరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, పార్టీ సమావేశాల్లో చర్చలను బయట పెట్టవద్దని నేతలకు అమిత్ షా సూచించారు. రాష్ట్రంలోని బీజేపీకి చెందిన నాలుగు స్థానాలు మినహా ఇతర స్థానాల్లో పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని కిషన్ రెడ్డి అమిత్ షా కు వివరించారు. ఎంపీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలు, వారి బలాబలాలపై కూడ అమిత్ షా చర్చించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నేతలు కలిసికట్టుగా పని చేయాలని అమిత్ షా సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 19 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కనీసం 10 నుండి 12 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతలకు కూడ అమిత్ షా దిశా నిర్ధేశం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం తీసుకున్న వైఖరి కూడ ఇందుకు కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. భారత రాష్ట్ర సమితికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని ప్రజలు భావించేలా ఆ పార్టీ చేసిన క్యాంపెయిన్ ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం ఆ పార్టీకి నష్టం చేసింది.
మరో వైపు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజలు నమ్మేలా చేసిందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు . అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన స్థానాల్లో కూడ ఎందుకు ఓటమి పాలు కావాల్సి వచ్చిందనే విషయాలపై పార్టీ నేతలను అమిత్ షా ఆరా తీస్తున్నారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు మార్పులు చేర్పుల విషయమై కూడ పార్టీ నాయకత్వం ఆలోచిస్తుందనే ప్రచారం కూడ లేకపోలేదు.దక్షిణాదిలో కర్ణాటకలో అధికారాన్ని ఆ పార్టీ కోల్పోయింది. దీంతో తెలంగాణపై బీజేపీ ఫోకస్ ను పెంచింది.