కరోనా దెబ్బకు భారతదేశం వణికి పోతుంది. ఇలాంటి వ్యాధులకు ధనిక, పేద పవర్ వీటితో సంబంధం లేదు. ఎవ్వరైనా ఒక్కటే. ఈ కరోనా వ్యాధికి భయపడి సామూహిక వేదికలపైకి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. 

ఇక తాజాగా కరోనా దెబ్బకు హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఆయన పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్ లో ఈ నెల 15వ తేదీన సభకు హాజరవ్వనున్నట్టు తొలుత తెలిపారు. కానీ కరోనా దెబ్బకు ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. 

ఈ సభకు వాస్తవానికి అమిత్ షా, పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారని కూడా బీజేపీ వర్గాలు ప్రకటించాయి. కాషాయ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కూడా. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ లు ఇప్పటికే బిజెపి కార్యాలయంలో ముఖ్య నేతలతో  భేటీ కూడా అయ్యారు.

ఈ  బహిరంగ సభకు జనసమీకరణ చేయడంపై దృష్టి సారించాలని పార్టీ ముఖ్య నేతలు గతంలోనే నిర్ణయించారు. సి ఏ ఏ పై బీజేపీ తమ అభిప్రాయాన్ని సభ ద్వారా స్పష్టం చేయాలని భావించింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.   రాష్ట్ర స్థాయిలో భారీ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో జాతీయ నాయకత్వం కూడా ఈ సభపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

 కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకు హాజరు కావడంతో బీజేపీ నేతలు జన సమీకరణను  ప్రతిష్టాత్మకంగా  చేయాలని నిర్ణయం తీసుకున్నారు.సి ఏ ఏ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే నిరసన గళం వినిపిస్తున్న డంతో అదే స్థాయిలో సీఏఏకు  అనుకూలంగా గళం వినిపించాలని  బీజేపీ ఈ సభను నిర్వహించాలని తలపెట్టింది.

బిజెపి నేతలు కూడా ఇటీవల కాలంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  టిఆర్ఎస్‌కు, సీఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని ప్రజల్లోకి  తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.ఇందుకు  ఈ సభను బీజేపీ వేదికగా ఎంపిక చేసుకొంది. 

 జాతీయ స్థాయిలో కూడా తమ బలాన్ని నిరూపించుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి భారీగా  జన సమీకరణకు చేయడంతోపాటు మైనారిటీలను కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడడం పై బిజెపి నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

కానీ ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా వారికి కరోనా రూపంలో వారి ప్లాన్స్ కి బ్రేకులు పడ్డాయి. కరోనా దెబ్బా మజాకా!