Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షా తో కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ.. మునుగోడు ఉపపోరుపై నేత‌ల‌కు దిశా నిర్దేశం.. 

మునుగోడు ఉపపోరు నేప‌థ్యంలో తెలంగాణ‌ బీజేపీ ముఖ్య నేత‌ల‌తో కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్ షా ప్ర‌త్యేక సమావేశమ‌య్యారు. హైదరాబాద్ బేగంపేట లోని హరిత ప్లాజాలో శ‌నివారం నాడు  తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి,ఈటెల రాజేందర్,రాజ్ గోపాల్ రెడ్డిల‌తో షా సమావేశ‌మ‌య్యారు.

Amit Shah held a special meeting with the main leaders of the Telangana BJP
Author
First Published Sep 17, 2022, 10:45 PM IST

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఒకవైపు అధికార టీఆర్ఎస్, మరోవైపు ప్ర‌తిప‌క్ష‌ బీజేపీ, కాంగ్రెస్‌లు మునుగోడు ఉప‌పోరులో ఎలాగైనా గెలుపు బావుట‌ను ఎగ‌ర‌వేయాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్రమంలో గెలుపు తమదంటే.. తమదని ప్ర‌తి పార్టీ దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉప‌పోరు బ‌రిలో దిగుతున్నాయి. దీంతో మునుగోడు ఉపపోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే.. గత రెండేండ్ల‌లో జ‌రిగిన ఉప ఎన్నికల‌లో ప్ర‌ధాన అధికార పార్టీ టీఆర్ ఎస్  కాకుండా.. ప్రతిప‌క్ష పార్టీ బీజేపీ గెలుపు సాధించ‌డం కూడా.. ఈ ఉప‌పోరును మ‌రింత ఉత్కంఠ పోరుగా మార్చింది.
 
ఈ త‌రుణంలో తాజాగా తెలంగాణ‌ బీజేపీ ముఖ్య నేత‌ల‌తో కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్ షా ప్ర‌త్యేక సమావేశమ‌య్యారు. హైదరాబాద్ బేగంపేట లోని హరిత ప్లాజాలో శ‌నివారం నాడు  తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి,ఈటెల రాజేందర్,రాజ్ గోపాల్ రెడ్డిల‌తో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశ‌మ‌య్యారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా ఈ భేటీ జ‌రిగింది. ఈ మేర‌కు అమిత్ షా తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. 

ఈ త‌రుణంలో కేంద్రమంత్రి అమిత్ షాతో రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌త్యేకంగా ఐదు నిమిషాలు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచార శైలి పైన, కార్య‌క‌ర్త‌ల చేరిక‌ల‌పై సంతృప్తి చెందారు..మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపికి  అనుకుల‌ వాతావరణము ఉందని, ఇంకా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తే బిజెపికి మునుగోడులో భారీ మెజార్టీ వస్తుందని అమిత్ షా సూచించారు. ప్రతి గ్రామానికి ఇన్ చార్జీల‌ను నియమిచ్చాల‌ని, ఉప ఎన్నికల ప్రచారాన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని షా సూచించారు. రెండు మూడు రోజుల్లో మునుగోడు ఎన్నికల కమిటీని వేసేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. 

స్థానికంగా పట్టున్న నాయకుల‌కు కమిటీలో అవకాశం కల్పించాల‌నీ, మునుగోడు లో ప్రతి ఓటర్ ను  కలిసే విధంగా ఎన్నికల ప్రచారానికి వ్యూహలను రూపొందించాల‌ని సూచించారు. మునుగోడులో బిజెపి అభ్యర్థి గెలుపు ఖాయమనే సంకేతాలు ఇప్పటికే వ‌స్తున్నాయని, ఇంకా ప్రతి ఓటర్ ను కలిసి ఆ సంకేతాలను బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల పోటీలో కాంగ్రెస్ లేకుండా పోయిందనీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేననే విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా .. టీ బీజేపీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. 

ప్రతి గ్రామంలో ముగ్గురు సభ్యులుగా కమిటీలు నియమించాలని, మండల, నియోజకవర్గ కమిటీలు నియమించాలని సూచించారు. కమిటీలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయితో పాటు గ్రామానికి చెందిన నేత ఉండేలా ప్లాన్ చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశం అనంతరం తరుణ్ చుగ్, బన్సల్ లతో రాజగోపాలరెడ్డి 20నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప‌లు క్షేత్ర‌స్థాయి విషయాల‌ను చ‌ర్చించారు. అలాగే.. ప్రజల్లో బీజేపీపై ఆసక్తి  ఉందని షా అన్నారు. నాయకులు ఇంకా కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు స్పందన బాగుందని తెలిపారు. మిగతా నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లి.. స‌మ‌స్య‌ల‌పై పోరాటాల‌ని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios