ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ ప్రకటన?.. మరోసారి వర్గీకరణపై చర్చ
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఎంఆర్పీఎస్ శాంతియుత రీతిలో ప్రదర్శనలు చేపడుతున్నది. మందకృష్ణ మాదిగ కలిసిన తర్వాత ప్రధాని మోడీ 11వ తేదీన ఎస్సీలు నిర్వహిస్తున్న సభకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో అధికారానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే తన పునాదిని బలోపేతం చేసుకునే పనిలో బీజేపీ ఉన్నది. తెలంగాణలో బలాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా పలు సముదాయాలను తమ వైపు తిప్పుకుంటున్నది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వారితో ఇంటరాక్ట్ అయ్యే.. వారికి భరోసా లేదా కీలక ప్రకటనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో 7వ తేదీ, 11వ తేదీ పర్యటనలపై ఆసక్తి నెలకొంది.
ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరు కాబోతున్నారు. ఆయన స్వయంగా బీసీ కావడం గమనార్హం. బీసీల సభలో ఆ సముదాయానికి భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో బీసీ సీఎం, బీసీ సబ్ ప్లాన్ హామీలను ఇచ్చింది.
ఇదిలా ఉండగా 11వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో ఎస్సీలు నిర్వహించే సభలోనూ ప్రధాని మోడీ హాజరుకాబోతున్నారు. ఈ సభలో వర్గీకరణపై ప్రధాని మోడీ ఏ ప్రకటన చేస్తారా? అనే ఆసక్తి నెలకొని ఉన్నది. ఇది వరకే ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ కార్యచరణ మొదలు పెట్టింది. ఎన్నికల సీజన్‌లో వర్గీకరణ డిమాండ్‌ను బలంగా ముందుకు తీసుకుపోతున్నది. ఈ డిమాండ్ చేస్తూ రాజధాని నగరంలో శాతియుతంగా ర్యాలీలు కూడా తీస్తున్నది.
Also Read: బీసీల కోసం బీజేపీ మరో హామీ.. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్: ఎంపీ లక్ష్మణ్
2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ తనకు తాను ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడారని, తమను కలిసి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చారని ఇటీవలే మందకృష్ణ మాదిగ అన్నారు. కానీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా వర్గీకరణ అంశంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, రాష్ట్ర బీజేపీ నేతలు ఈ అంశాన్ని జాతీయ నాయకత్వం ముందుకు తీసుకెళ్లాలనీ అన్నారు.
ఈ రోజు హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఓ ప్రశ్నకు జవాబుగా వర్గీకరణ అంశంపై స్పందించారు. మంద కృష్ణ మాదిగా స్వయంగా ప్రధాని మోడీని కలిశారని, ఆయన పిలుపు మేరకు 11న హైదరాబాద్‌లో ఎస్సీల సభలో మోడీ పాల్గొంటారనీ స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణను దళిత మేధావులూ చర్చించారు. సమర్థించారు. దామాషా ప్రకారం, అందిరికీ ఫలాలు అందాలనే సూత్రం వర్గీకరణతోనే సాధ్యం అవుతుందని వాదించారు. దళితుల్లోనూ వర్గీకరణ కీలకమైన చర్చగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే 11వ తేదీన ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై ఎలాంటి కామెంట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.