జైలు నుండి అల్లు అర్జున్ విడుదల ... ఈ ఆలస్యంపై లాయర్ ఏమన్నారంటే
సినీ హీరో అల్లు అర్జున్ జైలునుండి విడుదలయ్యారు. అయితే బెయిల్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన లాయర్ సీరియస్ అయ్యారు. మరి అల్లు అర్జున్ ఏమన్నారంటే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు జైలు నుండి బయటకు వచ్చారు. నిన్నటి నుండి సాగుతున్న హైడ్రామాకు తెరపడింది... హైకోర్టు నుండి బెయిల్ కాపీ అందడంతో ఆయన విడుదలయ్యారు.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యహరించిన తీరుపై ఆయన లాయర్ అశోక్ రెడ్డి అసహనం వ్యక్తం చేసారు. హైకోర్ట్ బెయిల్ ఆర్డర్ కాపీ అందినా పోలీసులు అల్లు అర్జున్ ను విడుదల చేయలేదని...అక్రమంగా నిర్బంధించారని లాయర్ పేర్కొన్నారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని లాయర్ హెచ్చరించారు.
విడుదల తర్వాత అల్లు అర్జున్ కామెంట్స్ :
జైలు నుండి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బాగానే వున్నాను... అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. చట్టాలను గౌరవించే పోలీసులకు సహకరించానని... న్యాయస్థానమే తనకు బెయిల్ ఇచ్చిందన్నారు. నిన్నటి నుండి తనగురించి ఆందోళనపడుతూ మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన బాధాకరం... మృతురాలు రేవతి కుటుంబానికి తన సానుభూతి వుంటుందన్నారు. ఇది ఎవరూ కావాలని చేసింది కాదు... అనుకోకుండా జరిగిందన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో వుంది కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. న్యాయస్థానాలను గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేనని అల్లు అర్జున్ అన్నారు.