హైదరాబాద్: ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడ కలిసి పనిచేయాలని భావిస్తున్నామని.. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు నాదెండ్ల మనోహర్ నివాసంలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత డాక్టర్ లక్ష్మణ్ గంటపాటు చర్చించారు.ఈ భేటీకి సంబంధించిన చర్చల విషయాలను పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించారు. 

ఒక్క ఓటు కూడ చీలిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము ఈ నిర్ణయాన్ని తీసుకొన్నామన్నారు.  హైద్రాబాద్ విశ్వనగరంగా మోడీ నాయకత్వంలోనే సాధ్యమౌతోందని ఆయన చెప్పారు. 

ఏపీతో పాటు తెలంగాణలో కూడ కలిసి పనిచేయాలని భావిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలనే ఆకాంక్షను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. తమ పార్టీ క్యాడర్ లో ఆందోళన ఉన్నప్పటికి విస్తృత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకొన్నానని ఆయన తెలిపారు.

జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆయన కోరారు.  ఒక్క ఓటు కూడ ఇతరులకు వెళ్లకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని ఆయన సూచించారు.'

also read:జీహెచ్ఎంసీతో పాటు అన్ని ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు: డాక్టర్ లక్ష్మణ్

ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసైనికులు నిరాశపడొద్దని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కార్యకర్తలను కోరారు.జనసేన కార్యకర్తలు పోటీలో ఉంటే వెంటనే నామినేషన్లను ఉపసంహరించుకొని బీజేపీ అభ్యర్ధులకు సహకరించాలన్నారు.

ఏపీ మాదిరిగానే తెలంగాణలో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. ఈ విషయమై రూట్ మ్యాప్ తయారు  చేసే క్రమంలోనే కరోనా వచ్చిందన్నారు. దీంతో సాధ్యం కాలేదన్నారు.2014 నుండి తెలంగాణలోని బీజేపీ నేతలతో తనకు సంబంధాలు ఉన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు.