హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా గెలుపొందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదని తెలిపారు. 

రాష్ట్రంలో అన్ని జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. జడ్పీ చైర్మన్ ప్రక్రియ సమన్వయానికి సంబంధించి అన్ని జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు కేటీఆర్. జిల్లాల వారీగా సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతల్ని అప్పగించినట్లు తెలిపారు. 

మంగళవారం వెల్లడికానున్న పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వనున్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇకపోతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. 

ఇవే ఫ‌లితాలు జడ్పీ ఎన్నికల ఫలితాల్లోనూ పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ‌యం సాధించిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, న‌ల్గొండ జిల్లా ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, వరంగల్  జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. 

ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జ‌గ‌దీశ్‌ రెడ్డి, మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఇతర పార్టీ సీనియర్ నేతలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.