కేసిఆర్ బిసీల బాంధవుడు అయితున్నడా?

First Published 3, Dec 2017, 9:22 PM IST
all party telangana bc leaders prizes kcr
Highlights
  • బిసిలను ఆకర్షించేందుకు భారీ కసరత్తు
  • అన్ని పార్టీల నేతలతో మూడు రోజుల సమావేశాలు
  • నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు షురూ అవుతాయన్న మంత్రులు

తెలంగాణ సిఎం కేసిఆర్ బిసి ప్రజాప్రతినిధుల సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఎం అనేక అంశాలపై బిసిలకు మేలు చేకూర్చేందుకు ఉదారంగా ముందుకొచ్చారని బిసి ప్రజాప్రతినిధులు చెప్పారు. పార్టీలకు అతీతంగా బిసి ప్రజాప్రతినిధులంతా ఈ సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అన్న పార్టీల నేతలు సిఎం కేసిఆర్ పై ప్రశంసల జల్లు  కురిపించారు. పొగడ్తలతో ముంచెత్తారు. మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు సమావేశం అనంతరం పలువురు నేతలు సమావేశం వివరాలు వెల్లడించారు.

బిజెపి నేత డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ లో 54శాతం బీసీ జనాభా ఉందన్నారు. విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, రాజకీయ అవకాశాలు, ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు. 3రోజులు సమావేశం జరపడం పట్ల సానుకూలంగా స్పందించారు. పూర్తిస్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. బడ్జెట్ కేటాయింపులు, సబ్ ప్లాన్ పై చర్చిస్తామన్నరు. అవసరమైతే జీవో లు, చట్టంలో మార్పులు చేస్తామని సీఎం చేప్పారని అన్నారు. బీసీల సంక్షేమంపై అవసరమైన తీర్మానాలు చేస్తామన్నట్లు చెప్పారు. తమ వంతు నివేదికలు, సూచనలు ఇస్తామని లక్ష్మణ్ వివరించారు.

బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ 54శాతం ఉన్న బీసీల అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. నివేదికను అమలు చేయటానికి సీఎం సిద్ధంగా ఉన్నారని అభినందించారు.

బిసి సంక్షేమ సంఘం నేత, టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కేసిఆర్ ను ఆకాశానికెత్తారు. బిసి సంక్షేమం పై సమావేశం పెట్టటం చరిత్రలో గొప్ప విషయం అన్నారు. అన్ని అంశాలపై చర్చించి బీసీ డిక్లరేషన్ ఇస్తే సీఎం అమలు చేస్తామన్నారని చెప్పారు.  10వేల కోట్లతో సబ్ ప్లాన్, పూర్తి ఫీజ్ రీఎంబెర్స్ మెంట్ ఇవ్వాలని కోరామన్నారు. పార్టీలకు అతీతంగా సమావేశం పెట్టటం గొప్ప విషయం అన్నారు. 12 ఫెడరేషన్లు పనితీరు మెరుగుపరచాలన్న దానిపై సూచనలు చేస్తామన్నారు. చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించినట్లు చెప్పారు. ప్రధానిని కలిసి పార్లమెంటు లో బిల్లు పెట్టటానికి అఖిలపక్షం ను ఢిల్లీ తీసుకెళతామన్నారని గుర్తు చేశారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ బిసి కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఎం చట్టబద్దత తెస్తామన్నారని చెప్పారు. మండలానికో రెసిడెన్షియల్ స్కూల్ తెస్తామన్నారు. వృత్తి లేని కులాలను దృష్టిలో పెట్టుకొని పథకాలు  ప్రవేశపెడతామన్నారు. కొన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి కమిషన్ కు చట్టబద్దత కల్పించాలని కోరినట్లు చెప్పారు.

మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల సమస్యల పరిస్కారానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంతరించిపోతున్న వృత్తులను ఆదుకోవడానికి సమగ్ర కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 10 రకాల అంశాలను గుర్తించటం జరిగిందని చెప్పారు. వృత్తులను ముడు రకాలుగా విభజించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిఎస్డీపి కి పనికొచ్చేవి, సర్వీస్ ఓరియెంటెడ్, వృత్తులున్నాయన్నారు. పార్టీలకు అతీతంగా సమగ్రంగా సీఎం సూచనలు చేయమన్నారని, ఇదొక శుభపరిణామం అని ఆభినందించారు. మూడు రోజులు సమగ్రంగా చర్చించి నివేదిక ఇవ్వమన్నారు దాన్ని ఉన్నది ఉన్నట్టు అమలు చేస్తం అవసరమైచతే చట్టం తెస్తామన్నారు.. ఇది కేసిఆర్ ఘనత అన్నారు. చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు కావాలని ఇవాళ బిసీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేశామన్నారు. కేంద్రంలోనూ బిసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి ఈ విషయంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు.

loader