తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్‌తో విపక్షాలు భేటీ: కరోనా, రైతుల సమస్యలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో అఖిలపక్ష నేతలు గురువారం నాడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అఖిలపక్షనేతలు సీఎస్ దృష్టికి తీసుకెళ్లానున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో అఖిలపక్ష నేతలు గురువారం నాడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అఖిలపక్షనేతలు సీఎస్ దృష్టికి తీసుకెళ్లానున్నారు.
గత వారం రోజుల క్రితం అఖిలపక్ష నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. కరోనాతో పాటు రైతాంగ సమస్యలపై చర్చించారు. కరోనాపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
గురువారంనాడు ఉదయం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటి అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు బూర్గుల రామకృష్ణారావు భవన్ లో సీఎస్ సోమేష్ కుమార్ తో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో రైతుల సమస్యలపై అఖిలపక్ష నేతలు చర్చించనున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆల్ పార్టీల నేతలు సీఎస్ దృష్టికి తీసుకురానున్నారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ధాన్యం కొనుగోలు విషయంలో అనేక ఇబ్బందులు చోటు చేసుకొంటున్నట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. తమ ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్రంలోని పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
ఈ విషయాలను కూడ అఖిలపక్షనేతలు సీఎస్ దృష్టికి తీసుకురానున్నారు. మరో వైపు ప్రతి ఒక్కరికి కూడ కరోనా విషయమై కూడ విపక్షాలు ప్రభుత్వానికి పలు సూచనలు చేసే అవకాశం ఉంది.