ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అఖిలపక్ష నేతలు బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వానికి సూచించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్‌ను కోరారు.

ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆందోళనలకు గురిచేస్తోందని ఆరోపించారు. హైకోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ తప్పని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కార్మికుల బతుకులు రోడ్డు పడ్డాయని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలు పరిష్కరించాలని.. ఆయన మొండిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వంతో మాట్లాడాలని గవర్నర్‌‌ను కోరామని ఆయన వెల్లడించారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని చాడ తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎండీ.. హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ దారుణమని చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. 

మంగళవారం ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం ముగిసింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ వచ్చే వరకు వేచిచూస్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. అప్పటి వరకు సమ్మె యథావిధిగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కార్మికులు తెలిపారని.. కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. 

రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరిస్తున్నట్లు తెలంగాణ కేబినెట్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కేబినెట్ తీర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సవాల్ చేసిన పిల్ పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 

పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ సమయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనములో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అలాంటప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందో చెప్పాలంటూ పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.