హైదరాబాద్: ఒకప్పుడు ఎన్నికలు అంటే చాలా హంగామా ఉండేది. ఆటోకో లేక జీపుకో రెండు మైకులు కట్టుకుని ఓ వ్యక్తి తమ అభ్యర్థికే ఓటెయ్యండని, తమ పార్టీనే గెలిపించడంటూ నోరు లాగేలా ఊదరగొట్టేవారు. రోజు మనిషి అలా ప్రచారం చెయ్యడం ఇబ్బందిగా మారడంతో ఆ ప్రచారాన్ని క్యాషెట్ గా చేసి మైక్ సెట్ లో పెట్టి ఆ వాహనాలు ఊరురా తిరిగేవి. 

అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. తెలంగాణ అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచి పార్టీలన్నీ సోషల్ మీడియాపై పడ్డాయి. ఒక్కో పార్టీ ఒక్కో గ్రూపు క్రియేట్ చేసుకోవడం, అలాగే అభ్యర్థి సైతం గ్రూప్ లు క్రియేట్ చేసుకుని సోషల్ మీడియా అడ్డాగా ప్రచారం చేసుకుంటున్నారు. 

మారుమూల ఏం జరిగినా ఒక వాట్సప్ లోనో ట్విట్టర్లతోనే సమాధానం చెప్పేసుకుంటున్నారు. అటు అభ్యర్థులు సైతం తాము చేసింది, చేయబోయేది ఒక వీడియో చేసి సోషల్ మీడియాపై వదులుతున్నారు. అది అలా సర్క్యూలేట్ అవుతూ రాష్ట్రమంతా తిరిగేస్తోంది. 

తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన తర్వాత సోషల్ మీడియాను చూస్తే చాలు అన్నీ రాజకీయ వార్తలే కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఇది సమాచారాన్ని పంచుకునే వేదిక లేక ఎన్నికల ప్రచార వేదిక అనేంత స్థాయిలో ప్రచారం జరిగిపోతుంది. 

ప్రస్తుతం సోషల్ మీడియా ఎన్నికల ప్రచారానికి అడ్డాగా మారిపోయింది. ఎన్నికల టైమ్ కావడంతో ఈ జోరు మరింత ఎక్కువైంది. ఎన్నికల సందర్భంగా కొత్తగా యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికలు తెగ పుట్టుకొచ్చేశాయి. దీంతో ఎటు చూసినా ఎన్నికల ప్రచారమే దర్శనమిస్తోంది.  

ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ పీక్స్ లో ఉంది. పార్టీలు, నేతలు అంతా ప్రచారపర్వంలో మునిగితేలుతున్నారు. అటు ఆయా పార్టీల మీడియా వర్కర్స్ సోషల్ మీడియాను దున్నేస్తున్నారు.

గతంలో ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో నేతలు ప్రచారం చేసేవారు. వాటికి ఇప్పుడు వాట్సప్,ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ తోడయ్యాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నేతలు చేస్తున్న హడావిడే మామూలుగా లేదు. 

ఇకపోతే కొందరు నాయకులైతే సోషల్ మీడియాపైనే తిష్టవేశారు. దీంతో పొలిటికల్ ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కుతుంది. కేవలం ప్రచారానికే కాదు అభ్యర్థులు తమ విధానాలను హైలెట్ చేసుకునేందుకు, ప్రత్యర్ధి వర్గాన్ని దెబ్బకొట్టేందుకు ఈ మాధ్యమాన్ని విస్తృతంగా వాడేసుకుంటున్నారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్, ఈసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ రెండు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరో మూడు పార్టీలతో  కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. ఈ నాలుగు పార్టీలు అధికారమే పరమావధిగా పోటీపడుతోంది. 

ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నానా హంగామా చేస్తున్నారు. ట్విట్టర్ ను ఓ రేంజ్ లో వాడేసుకుంటున్నారు. అటు ఐ సపోర్ట్ కేసీఆర్ అంటూ ఫేస్ బుక్ గ్రూప్ ప్రచారంతో హోరెత్తిస్తోంది. టీఆర్ఎస్ ప్రచారమే కాదు ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ వేదికగా ప్రతిపక్ష పార్టీలపైనా విరుచుకుపడుతున్నారు.  

అటు కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాను వాడుకోవడంలో తక్కువేం కాదని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ కు ధీటుగానే సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. అటు టీడీపీ సైతం తెలుగుదేశం పార్టీ అనే గ్రూపుతో ప్రచారం నిర్వహిస్తోంది. అధికార పార్టీని తూర్పారపడుతోంది. మెుత్తానికి గెలుపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచార హోరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.