Asianet News TeluguAsianet News Telugu

రెమ్ డెసివిర్ సహా కరోనా మందులు ఇక ప్రభుత్వాసుపత్రుల్లో : కేసీఆర్

ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది. 

All Medicines To Treat COVID Will Be Available In Government Hospitals Including Remdesivir: Telangana CM KCR
Author
Hyderabad, First Published Aug 6, 2020, 10:29 AM IST

నిన్న తెలంగాణ కాబినెట్ సుదీర్ఘంగా భేటీ అయి అనేక కీలక విషయాల మీద చర్చించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా వ్యాప్తిని అరికట్టడంపై కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది తెలంగాణ సర్కార్. 

కరోనా వ్యాప్తి – వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స- ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, వివిధ విభాగాధిపతులను సమావేశానికి ఆహ్వానించి చర్చించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కరోనా పరిస్థితిపై వివరాలు అందించారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకిన కరోనా ప్రస్తుతం పెద్ద నరగాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ లోనూ  కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాలు రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని వైద్య నిపుణులు కేబినెట్ కు వివరించారు.

ప్రజలు పెద్దగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కేబినెట్ తెలిపింది. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. 

ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎన్ని డబ్బులైన వెనకాడేది లేదని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసి విర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. 

పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారం కలెక్టర్లకు ఇచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెల వారీగా ఖచ్చితంగా విడుదల చేయాలి.
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

మంత్రి ఈటల రాజెందర్, సిఎస్ సోమేశ్ కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాల్లో అవసరాలు తెలుసుకుంటారు. వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios