హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 74 లక్షల 04 వేల 286 మంది ఓట్లరు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.కరోనా నేపథ్యంలో  పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్క్ ఉంటేనే ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 38 లక్షల 56 వేల 770 మంది పురుషులు, 35 లక్షల, 46 వేల 847 మంది మహిళలు ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. 669 మంది ఇతరులకు కూడా ఓటు హక్కు ఉంది.కరోనా కారణంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ ను వినియోగిస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్ పద్దతిలో జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లో అత్యధికంగా 79,290 ఓటర్లున్నారు, రామచంద్రాపురంలో అతి తక్కువగా  27,997 ఓటర్లున్నారు.కొండాపూర్ లో అత్యధికంగా 99 పోలింగ్ కేంద్రాలు, రామచంద్రాపురంలో అత్యల్పంగా 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 74 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

జీహెచ్ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ 150, బీజేపీ 149, కాంగ్రెస్, 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతరులు 49 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 1122 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వచ్చే ఓటర్లు మాస్క్ ధరిస్తేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి స్తారు. పోలింగ్ నిర్వహణకు 48 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్ధికి ఒక వాహనం మాత్రమే అనుమతి ఇచ్చింది ఎన్నికల సంఘం.

ఎన్నికల నిర్వహణకు గాను 45 వేల సిబ్బందిని వినియోగిస్తున్నారు..సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 51,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు గాను 28 వేల 683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో వెయ్యి ఓటర్లు మించకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.  9,101 పోలింగ్ కేంద్రాల్లో 1439 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 1004 పోలింగ్  అత్యంత సమస్యాత్మకమైనవిగా, 257 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవని ఎన్నికల సంఘం ప్రకటించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నగరంలోని 12 వేల పోలీసులతో పాటు జిల్లాల నుండి 3 వేల మంది పోలీసులకు కూడ విధులను అప్పగించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 20 ప్లాటూన్స్,సాయుధ బలగాలు 36 ప్లాటూన్స్ ను వినియోగిస్తున్నారు.