టీఆర్‌ఎస్‌ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ బీజేపీలో చేరారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో భిక్షమయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

టీఆర్‌ఎస్‌ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ బీజేపీలో చేరారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో భిక్షమయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్.. భిక్షమయ్య గౌడ్‌ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఇతర నేతలు పాల్గొన్నారు. ఆలేరు ప్రజలకు సేవచేసేందుకే బీజేపీలో చేరినట్టుగా భిక్షమయ్య గౌడ్ చెప్పారు. 

ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరినా అభివృద్ధిలో తనను భాగస్వామిని చేయలేదని అన్నారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆలేరు ప్రజల నుంచి తనను వేరుచేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ఆలేరు అభివృద్ది కోసమే తాను బీజేపీలో చేరినట్టుగా పేర్కొన్నారు. 

ఇక, భిక్షమయ్య గౌడ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన భిక్షమయ్య గౌడ్.. టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అయితే టీఆర్‌ఎస్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదని భిక్షమయ్య గౌడ్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్ పోస్టు ఆశించిన నిరాశే ఎదురుకావడంతో.. పార్టీ మారాలనే నిర్ణయం తీసుకన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలతో చర్చలు జరిపిన భిక్షమయ్య గౌడ్.. కాషాయ కండువా కప్పుకున్నారు. 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో సీనియర్ నేతలు, పార్టీ నాయకత్వాలపై అసంతృప్తితో ఉన్న నేతలతో మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఆలేరులో కీలక నేతగా ఉన్న భిక్షమయ్య గౌడ్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా.. అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీకి ఒక రకంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.