Asianet News TeluguAsianet News Telugu

మీడియా గ్లామర్ కోసం పోటాపోటీ

  • డ్రగ్స్ విచారణ వేగవంతం అయింది
  • సినీ ప్రముఖులంతా విచారణకు వస్తున్నారు
  • డ్రగ్స్ కేసులో గ్లామర్ వార్ షురూ
  • మీడియా గ్లామర్ కోసం పోటాపోటీ 
akun and chandravadan vie for media attention

గత నెలరోజులుగా ఎక్సైజ్ శాఖ వార్తలో నానుతున్నది. కెల్విన్ అనే డ్రగ్ సప్లయర్ అరెస్టు... స్కూళ్లకు డ్రగ్ సరఫరా వెలుగులోకి వచ్చిన కానుంచి అనూహ్య మలుపులు తిరుగుతున్నది. డ్రగ్ మాఫియా లింకులు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నట్లు వార్తలొస్తున్నయి. సినీ పరిశ్రమ డ్రగ్ మాఫియా చేతిలో చిక్కుకుపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. వరుసబెట్టి సినీ పెద్దలు విచారణకు వస్తున్నారు. దీంతో డ్రగ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది దేశవ్యాప్తంగా.

ఇక సందుట్లో సడేమియా అన్నట్లు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇంకో కొత్త ఫైట్ కూడా మొదలైనట్లు కనిపిస్తోంది. అదే మీడియా గ్లామర్ కోసం జరుగుతున్న ఫైట్ గా చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో తొలినుంచీ అకున్ సభర్వాల్ సినీ హీరోలా క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయనను ఒకదశలో ఉపముఖ్యమంత్రి సుతిమెత్తగా మందలించారు కూడా. విద్యాశాఖకు తెలియకుండానే విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చుడేంది అని ఆయన ప్రశ్నించారు.

అయినప్పటికీ డ్రగ్స్ వ్యవహారం సీరియస్ గా నడుస్తున్న సందర్భంలో అకున్ సభర్వాల్ సెలవుపై వెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో ఆయనను సర్కారే సెలవుపై పంపుతోందని, డ్రగ్స్ కేసు కూడా నయీం కేసు మాదిరిగానే నీరుగారిపోతుందన్న ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా తన సెలవును అకున్ వాయిదా వేసుకున్నారు. తర్వాత వరుస విచారణలు జరుగుతున్నాయి. దీంతో ప్రతిరోజు అకున్ సభర్వాల్ మీడియాలో నానుతున్నాడు. మీడియా గ్లామర్ బాగానే అకున్ సభర్వాల్ కు వంటబట్టింది అని కొందరు అధికారులు జోక్ లు వేసుకున్నారు.

ఇక గత నాలుగైదు రోజులుగా ఐఎఎస్ అధికారి ఆర్.వి.చంద్రవదన్ కూడా మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. గత ఆదివారం డ్రగ్ మాఫియా పై సిఎం సమీక్ష జరిపారు. ఆ సమీక్ష తర్వాత నుంచి చంద్రవదన్ మీడియాలో నానుతున్నారు. ప్రతిరోజు ఉదయం లేదా, సాయంత్రం మీడియా ముందుకొచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. దీంతో మీడియా గ్లామర్ కోసం చంద్రవదన్ పోటీకి వచ్చారని క్రైం రిపోర్టర్లు చమత్కరిస్తున్నారు.

ఇది సాధారణంగా ఉండే ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల మధ్య ఉండే వైరం లాంటిది కాదని కేవలం వీరిద్దరి మధ్య మీడియా గ్లామర్ ఫైట్ మాత్రమేనన్న ప్రచారం మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ కు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ కు మధ్య ఎలాంటి వైరం లేదని చెబుతున్నారు. వారిద్దరి మధ్య సహజ వైరం అయిన ఐఎఎస్, ఐపిఎస్ వైరం కూడా లేదని చెబుతున్నారు. కేవలం వీరిద్దరి మధ్య ఉన్నది మీడియా గ్లామర్ వైరం మాత్రమేనని చెబుతున్నారు.

మీడియా గ్లామర్ కోసం ఇద్దరూ పోటీ పడుతున్న సమయంలో ఇక మేమేమీ తక్కువ తినలేదన్నట్లు కిందిస్థాయి ఎక్సైజ్ సిబ్బంది సినీ గ్లామర్ కోసం తహతహలాడుతున్నారు. పైన విచారణ జరగుతంటే కింద సినీ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులతో సెల్ఫీలు దిగేందుకు ఈ సిబ్బంది పోటీ పడుతున్నారు.

మొత్తానికి డ్రగ్ విచారణ పుణ్యమా అని ఇటు  సినీ గ్లామర్, అటు మీడియా గ్లామర్ ఏకమైపోయాయయని కొందరు జోకులేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios