సదానందం రిమాండ్ రిపోర్ట్: యూట్యూబ్‌లో చూసి ఏకే-47 వాడాడు
అక్కన్నపేట కాల్పుల కేసులో సదానందం పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. సదానందం యూట్యూబ్ చూసి ఏకే 47 ఎలా ఉపయోగించాలో నేర్చుకొన్నట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని అక్కన్నపేట కాల్పుల కేసులో నిందితుడు సదానందం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్రైమ్ సినిమాను తలపించే విధంగా సదానందం పోలీస్ స్టేషన్ నుండి ఏకే 47, కార్బన్ ను దొంగిలించినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఈ నెల 7వ తేదీన అక్కన్నపేటలో సదానందం గంగరాజుపై ఏకే 47తో కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో గంగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. గంగరాజు, సదానందం కుటుంబాల మధ్య ప్రహారీగోడ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా గంగరాజుపై సదానందం కాల్పులకు దిగాడు. ఈ ఘటనకు పాల్పడిన సదానందాన్ని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో సదానందం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్టుగా సమాచారం. ఈ విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. క్రైమ్ సినిమాలో మాదిరిగా సదానందం వ్యవహరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ఏకే 47, కార్బైన్ లను పోలీసుల కళ్లుగప్పి సదానందం అపహరించుకొని వెళ్లినట్టుగా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. తెలిసింది
పోలీస్ స్టేషన్ నుండి అపహరించుకొని వెళ్లిన సదానందం ఏకే 47ను ఎలా ఉపయోగించాలనే విషయాన్ని యూట్యూబ్‌లో చూసి నేర్చుకొన్నాడు. ఏకే 47 పాడుకాకుండా కొబ్బరినూనెతో ఎప్పుడూ దాన్ని శుభ్రంగా తుడిచేవాడు.
Also read:సిద్దిపేట కాల్పుల కేసులో సంచలనం... ఆ ఏకే-47 పోలీసులదేనా...?
ఏకే 47తో పాటు బుల్లెట్లను కూడ కొబ్బరినూనెతో శుభ్రం చేసి జాగ్రత్తగా భద్రపర్చేవాడు. బుల్లెట్లు లేకుండా ఏకే 47 ట్రిగ్గర్ నొక్కుతూ ఆనందం చెందేవాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ నుండి ఆయుధాలను సధానందం ఎలా అపహరించాడనే విషయమై ఇంకా అంతుబట్టడం లేదు. ఈ విషయమై రిటైర్డ్ సీఐ భూమయ్య కూడ పోలీసు శాఖపై ఆరోపణలు చేశారు.అప్పటి ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఈ రెండు ఆయుధాలు పోలీస్ స్టేషన్ నుండి అపహారణకు గురైనట్టుగా ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.