సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత ఆత్మహత్య కేసులో అజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్వేత మరణానికి అజయే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. శ్వేత ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నిర్ధారించారు.

అజయ్ కారణంగానే శ్వేత మనస్థాపానికి గురైందని.. అలాగే సోషల్ మీడియాలో ఫోటోలను డిలీట్ చేయకుండా వేధింపులకు గురిచేసినట్లుగా తేలింది. అన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులు అజయ్‌ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

ప్రేమ, పెళ్లితో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత మరణానికి కారణమైన అజయ్‌కి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కుమార్తె డిప్రషన్‌లోకి వెళ్లిందని... వీరిపైన చర్యలు తీసుకోవాలని వాడు డిమాండ్ చేస్తున్నారు.

తమ బిడ్డలాగా మరో అమ్మాయి బలి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్వేత ఆత్మహత్య చేసుకోలేదని.. అజయే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

శ్వేతను రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లాడని చెబుతున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శ్వేతను అజయ్ ప్రేమ పేరిట బ్లాక్ మెయిల్ చేశాడని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

శ్వేత వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని.. అవమానం తట్టుకోలేక శ్వేత డిప్రెషన్‌కు లోనైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాచకొండ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశామని.. కానీ సీఐ, టెక్నీషియన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.