Asianet News TeluguAsianet News Telugu

ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ.. ప్రమాణ స్వీకారం చేసేదేలేదు: రాజాసింగ్

Goshamahal MLA Raja Singh: ఎంఐఎంతో కాంగ్రెస్ స్నేహాన్ని ప్రశ్నించిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్.. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడం ద్వారా మైనార్టీలను ఆకట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
 

AIMIM leader Akbaruddin Owaisi appointed pro-tem Speaker, Wont take oath says Goshamahal MLA Raja Singh RMA
Author
First Published Dec 8, 2023, 9:38 PM IST

Telangana: కాంగ్రెస్, ఎంఐఎంల‌ను విమ‌ర్శిస్తూ గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కుడు రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తే బీజేపీ నేతలు ప్రమాణ స్వీకారం చేయరని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే రాజాసింగ్ స్పందించారు.

ఎంఐఎంతో కాంగ్రెస్ స్నేహాన్ని ప్రశ్నించిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్.. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడం ద్వారా మైనార్టీలను ఆకట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఎంఐఎం నేత‌లు త‌న‌పై ఆస‌భ్య ప‌ద‌జాలం ఉప‌యోగించార‌ని విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. అక్బరుద్దీన్ ఒవైసీని ఖాసీం రజ్వీ వార‌సునిగా పేర్కొంటూ ఆగ్ర‌హం వ్య‌క్త‌చేస్తూ.. "రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ కానున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ ముందు అందరూ ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.  నేను బతికున్నంత కాలం ఎంఐఎం ముందు ప్రమాణం చేయను" అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

తాను 2018లో కూడా ఎంఐఎం నేత ముందు ప్రమాణం చేయ‌లేద‌ని తెలిపారు. "అప్పుడు నేను ప్రమాణం చేయలేదు, ఇప్పుడు చేయను" అని రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. టీఆర్ఎస్ బాటలో నడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తమ కారు స్టీరింగ్ ను ఎంఐఎం చేతిలో పెట్టి పెద్ద తప్పు చేశారు. నేడు ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. తెలంగాణలో ఉంటూ హిందువులను చంపేస్తామని బెదిరిస్తున్నారనీ, అలాంట‌ప్పుడు నేతలు ప్రమాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎంఐఎంతో కాంగ్రెస్ స్నేహాన్ని ప్రశ్నించిన ఆయన అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవడం ద్వారా మైనార్టీలను ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం నేత ముందు తామేవ‌ర‌మూ ప్రమాణం చేయ‌మ‌నీ, స్పీకర్ ను అసెంబ్లీకి కేటాయించే రెండో రోజే ఆ పని చేస్తామ‌ని రాజాసింగ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios