Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ స్పీకర్‌కు అసదుద్దీన్ ఒవైసీ లేఖ.. తన నివాసంపై దాడి కేసును ప్రివిలెజ్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి

ఢిల్లీలోని ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అధికారిక నివాసంపై ఇటీవలే దాడి జరిగింది. ఈ దాడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన నివాసం దగ్గర మెరుగైన భద్రత కల్పించాలని, ఈ కేసును ప్రివిలెజ్ కమిటీకి పంపాలని, తద్వారా సమగ్ర దర్యాప్తు తర్వాత విలువైన సూచనలు వస్తాయని అభిప్రాయపడ్డారు.
 

AIMIM chief asduddin owaisi wrote letter to LS speaker seeking intervention
Author
Hyderabad, First Published Sep 24, 2021, 2:47 PM IST

హైదరాబాద్: ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై ఈ నెల 21న దాడి జరిగింది. ఆయన అధికారిక నివాసం వద్ద కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. ఆయన నేమ్ ప్లేట్, గేటులను ధ్వంసం చేశారు. ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిందిగా లోక్‌‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఒవైసీ లేఖ రాశారు. తన నివాసం వద్ద మెరుగైన భద్రతను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అంతేకాదు, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం ప్రివిలెజ్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో అశోక్ రోడ్డులోని తన అధికారిక నివాసంపై క్రిమినల్స్ దాడి చేశారని అసుదుద్దీన్ ఒవైసీ తన లేఖలో పేర్కొన్నారు. వారు హిందు సేన ర్యాడికల్ సంస్థకు చెందినవారని ఆరోపించారు. తన నివాసంపై దాడితోపాటు తన కేర్‌టేకర్ సిబ్బందిపైనా దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో స్పీకర్ జోక్యంతోపాటు ఈ కేసును ప్రివిలెజ్ కమిటీకి పంపాలని కోరారు. తద్వారా సమగ్ర దర్యాప్తునకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం సరైన సూచనలను ఆ కమిటీ చేస్తుందని తెలిపారు.

పార్లమెంటు సభ మర్యాదను కాపాడటానికి, దాని పవిత్రతను పరిరక్షించడానికి ఈ కేసులో వెంటనే యాక్షన్ తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పార్లమెంటు‌పైనే బెదిరింపుగా దీన్ని భావించాలని పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు, అధికారులు ఈ చర్యను పార్లమెంటు ధిక్కరణ చర్యగా పరిగణించాలని సూచించారు. ఈ పార్లమెంటు సభ్యుడిగా తనకు ఉండే ప్రివిలెజ్‌ను కాపాడాలని కోరారు.

 

ఇలాంటి తీవ్ర చర్యలకు పాల్పడేలా వ్యక్తులను మారుస్తున్న బీజేపీనే ఇందుకు బాధ్యత వహించాలని అసదుద్దీన్ ఘటన జరిగిన తర్వాత ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios