Asianet News TeluguAsianet News Telugu

జిన్నా కామెంట్‌పై ఒవైసీ రియాక్షన్.. ‘భారత ముస్లింలకు సంబంధం లేదు’

సర్దార్ పటేల్, గాంధీ, నెహ్రూ, జిన్నాలు ఒకే విద్యాసంస్థలో చదువుకుని బారిస్టర్ చదివారని, భారత స్వాతంత్ర్యం కోసం వెన్నుచూపకుండా పోరాడారని అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఉత్తరాది మొదలు దక్షిణాది వరకు ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, ఎంఐఎం చీఫ్ అసద్ కూడా స్పందించారు.
 

AIMIM chief asaduddin owaisi reacts on akhilesh yadavs muhammad ali jinnah remark
Author
Hyderabad, First Published Nov 1, 2021, 5:48 PM IST

న్యూఢిల్లీ: Uttar Pradesh అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రచారం హీటెక్కుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో యాదవ్, ముస్లింల ఓటర్లు కీలకమని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే Samajwadi Party చీఫ్ Akhilesh Yadav చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాలేదు. Telangana నుంచీ రియాక్షన్స్ వస్తున్నాయి.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ Pakistan జాతిపితగా భావించే Muhammad Ali Jinnahను ప్రస్తావించారు. భారత స్వాతంత్ర్య సమర యోధులతోపాటుగా ఆయన పేరును పేర్కొన్నారు. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, జిన్నాలు ఒకే విద్యా సంస్థలో చదువుకున్నారని వివరించారు. వారంతా బారిస్టర్‌లు అయ్యారని తెలిపారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని అన్నారు. 

ఇదే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్‌ పైనా విమర్శలు చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఒక భావజాలాన్ని నిషేధించారని గుర్తుచేశారు. దేశాన్ని మతం, కులాల ఆధారంగా ఆ భావజాలం విభజిస్తుందని ఆయన పసిగట్టారని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని పరోక్షంగా ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు చేశారు. 

Also Read: తాలిబాన్లు భారత్ వైపు కన్నెత్తి చూడరు.. ఎందుకంటే..! యూపీ సీఎం వ్యాఖ్యలు

అఖిలేశ్ యాదవ్ చేసిన జిన్నా వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వెలువడుతున్నది. అది తాలిబానీ మెంటాలిటీ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. తెలంగాణకు చెందిన AIMIM చీఫ్ Asaduddin Owaisi కూడా స్పందించారు.

భారత ముస్లింలకు ముహమ్మద్ అలీ జిన్నాతో ఏ సంబంధమూ లేదనే విషయాన్ని అఖిలేశ్ యాదవ్ అర్థం చేసుకోవాలని అన్నారు. మా పూర్వీకులు, నేతలు ద్విజాతి(టూ నేషన్) సిద్ధాంతాన్ని తిరస్కరించారని వివరించారు. భారత్‌నే తమ దేశంగా ఎంచుకుని ఇక్కడే ఉన్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఓ వర్గాన్ని సంతుష్టం చేయగలరని భావించి ఉంటే అది తప్పు అని అభిప్రాయపడ్డారు. అఖిలేశ్ యాదవ్ ఆయన సలహాదారును వెంటనే మార్చుకోవాలని అన్నారు. ఆయన కూడా స్వయంగా కొంత చదువుకోవాలని, చరిత్రపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ దేశంలో ముస్లిం వోటు బ్యాంకు అనేదే లేదని, ఇకపైనా ఉండబోదని అసదుద్దీన్ ఒవైసీ ఓ ట్వీట్ చేశారు. ఎప్పటి నుంచో హిందూ వోటు బ్యాంకు ఉన్నదని, ఇకపైనా ఉంటుందని అన్నారు.

ఇవే జిన్నా వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయవతి కూడా స్పందించారు. ఎస్‌పీ, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదని ఆరోపించారు. అందుకే సమాజ్ వాదీ పార్టీ జిన్నా గురించి మాట్లాడుతుందని, బీజేపీ వెంటనే దానికి రియాక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఇది ఈ రెండు పార్టీల మధ్య ఏర్పాటు చేసుకుని ఒక వ్యూహమని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే హిందూ, ముస్లింల మధ్య సహోదరభావాన్ని, మంచి వాతావరణాన్ని చెడగొట్టడంలో భాగంగానే ఈ వ్యూహమని ఆరోపణలు చేశారు.

Also Read: అఖిలేష్ యాదవ్, మాయావతిపై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు..!

ఈ రెండు పార్టీ ఒకదానికి ఇంకోటి సహకరించుకుంటాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల ఆలోచన ధోరణుల్లో కులాలు, మతపరమైన అంశాలే ప్రధానంగా ఉంటాయని వివరించారు. అందుకే ఇవి రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఎదుగుతుంటాయని చెప్పారు. అందుకే సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పుంజుకుంటుందని వివరించారు. ఒకవేళ బీఎస్పీ అధికారంలోకి వస్తే బీజేపీ బలహీనపడుతుందని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios