ఉప్పల్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారీ భద్రత.. స్టేడియంలోకి ఈ వస్తువులకు నో ఎంట్రీ..
క్రికెట్ మహాసంగ్రామం వన్డే వరల్డ్ కప్ -2023 భారత్ వేదికగా నేడు ప్రారంభం అయింది. వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో కూడా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.
క్రికెట్ మహాసంగ్రామం వన్డే వరల్డ్ కప్ -2023 భారత్ వేదికగా నేడు ప్రారంభం అయింది. వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో కూడా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 6, 9, 10 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో వన్డే వరల్డ్ కప్ మ్యా చ్‌ల కోసం 1,500 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. డీఎస్ చౌహాన్.. ఉప్పల్ స్టేడియంలో గురువారం ఉదయం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రాపర్ ప్లాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం వారం రోజుల క్రితమే బీసీసీఐ ప్రతినిధులు, హెచ్ సీఏతో మీటింగ్ పెట్టామన్నారు. ఐపీఎల్ మాదిరిగానే.. వరల్డ్ కప్ మ్యాచ్‌లను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని తెలిపారు. చెకింగ్ పాయింట్లు, పార్కింగ్ స్థలాలు సహా వివిధ పాయింట్ల వద్ద మొత్తం 360 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రౌండ్ కి వచ్చిన ప్రతీ ఒక్కరు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ ని మానిటరింగ్ చేస్తామని చెప్పారు.
ఉప్పల్ స్టేడియంలోని మ్యాచ్‌లు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతున్నందున.. ఉదయం 11 గంటలకు ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తామని తెలిపారు. ఇక, పోలీసులు విడుదల చేసిన ప్రకనట ప్రకారం.. ప్రేక్షకులు ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్లు, పదునైన లోహాలు లేదా ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్‌లు, కాయిన్స్, రైటింగ్ పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్‌లు, పెర్ఫ్యూమ్‌లు, సంచులు, బయట తినుబండారాలను స్టేడియం లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
స్టేడియం పరిసర ప్రాంతాల్లో అదనపు బందోబస్త్ ఏర్పాట్లు చేసినట్టుగా పోలీసులు ప్రకటనలో తెలిపారు. ఈవ్ టీజింగ్‌ను నియంత్రించేందుకు షీ టీమ్‌లు / యాంటీ-ఈవ్ టీజింగ్ టీమ్‌లు స్టేడియంలో, చుట్టుపక్కల మోహరించనున్నట్టుగా చెప్పారు. స్టేడియం వెలుపల నిషేధించబడిన విక్రేతల మోసాలను నియంత్రించడానికి విజిలెన్స్ బృందాలను నియమించినట్టుగా వెల్లడించారు. ప్రేక్షకులు సులభంగా స్టేడియంకు చేరుకోవడానికి తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. స్టేడియం పరిసరాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. తక్షణ వైద్యం కోసం ఏడు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్టుగా చెప్పారు.