సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ మనీలాండరింగ్ కేసులో డబ్బును భారీ ఎత్తున విదేశాల్లో దాచినట్టు తేలింది. సంస్థ యాజమాన్యం ఆ మొత్తాన్ని కరీబియన్ సముద్రంలోని కేమన్ దీవుల్లో దాచినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం విదేశాల్లో ఆర్థికపరమైన సేవలందించే పనామా సంస్థ మొసాక్ ఫొన్సెంకా సహకారం తీసుకున్నట్లు తేలింది. 

కేమన్ దీవుల్లో డొల్ల కంపెనీలు సృష్టించి పెట్టుబడులను మళ్లించడం ద్వారా అగ్రిగోల్డ్ యాజమాన్యం మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించింది. ఆకర్షణీయ పథకాలతో దాదాపు 32 లక్షల మంది డిపాజిట్ దారులను మభ్యపెట్టి దాదాపు రూ. 6.380 కోట్లను సేకరించిన సంగతి తెలిసిందే. 

ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తు చేయగా మనీ లాండరింగ్ కోణం వెలుగు చూసింది. దీనిమీద ప్రస్తుతం ఈడీ దృష్టి సారించింది. సంస్థ ఛైర్మన్ అవ్వ వెంకట రామారావు, డైరెక్టర్లు వెంకట శేష నారాయణరావు, హేమసుందర వరప్రసాద్ ను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి బుధవారం హైదరాబాద్ లోని ఈడీ పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచింది. 

న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి అప్పగించాలని ఈడీ పిటీషన్ దాఖలు చేసింది. 

దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఈ సంస్థ డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. స్తిరాస్తి వ్యాపారం పేరుతో ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. ఇక డిపాజిటర్లకు కేటాయించిన ప్లాట్లకు హద్దులు నిర్ణయించకుండా, లొకేషన్ చెప్పకుండా, మార్కెట్ వ్యాల్యూ తెలపకుండా సర్వే నెంబర్లు లేకుండా మాయ చేసింది. దీనికి ఆర్బిఐ నుంచి పర్మిషన్లు కూడా లేదు.

ఇది గమనించిన సెబీ వెంటనే అగ్రిగోల్డ్ బిజినెస్ ఆపేయాలని డిపాజిట్ దారులకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దీన్ని ఛైర్మన్ ఏ మాత్రం పట్టించుకోలేదు సరికదా కొత్త కంపెనీలను తెరపైకి తెచ్చారు. కమీషన్ ఏజెంట్ల ద్వారా భారీగా డిపాజిట్లు సేకరించడంతో ఇది పొంజి స్కామ్ గా మారింది. 

అంతేకాదు ప్లాట్ల పేరుతో 32 లక్షల మంది దగ్గర డబ్బు సేకరించగా.. వెంచర్లలో మాత్రం 5.3 లక్షల ప్లాట్లు మాత్రమే ఉన్నట్టుగా ఈడీ దర్యాప్తులో తేలింది.