Agnipath Protest : సికింద్రాబాద్ ఆందోళనలో పాల్గొన్న యువకుడు ఆత్మహత్యాయత్నం

అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్ మెంట్ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆందోళనలో పాల్గొన్న వరంగల్ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

agnipath protest in secunderabad : Student commit suicide attempt in janagama

జనగామ: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొందరు యువకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైల్వేను టార్గెట్ చేసిన యువకులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై దాడికి తెగబడ్డారు. ఇలా రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులకు భయపడి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆందోళనలో పాల్గొన్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాదం జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.  

స్టేషన్ ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అజయ్ (20) ఆర్మీలో చేరేందుకు సిద్దమవుతున్నాడు. అయితే త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం అతడికి నచ్చలేదో లేక ఎవరైనా రెచ్చగొట్టారో తెలీదుగానీ సికింద్రాబాద్ లో జరిగిన ఆందోళనలో ఇతడు కూడా పాల్గొన్నాడు. ఈ సమయంలో అతడు అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ మీడియాతో కూడా మాట్లాడాడు. ఇలా టీవీలో కనిపించిన తనపై పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనని అజయ్ భయపడిపోతున్నాడు. 

పోలీస్ కేసు నమోదు, ఆ తర్వాత పరిణామాలను ఊహించుకుని అజయ్ ఆందోళనకు గురయ్యాడు. ఓవైపు జైలుకెళతానేమోనని భయం... మరోవైపు తాను ఇష్టపడ్డ ఆర్మీ ఉద్యోగమే కాదు ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు అర్హత కోల్పోతానన్న ఆందోళన వెంటాడటంతో అతడు తీవ్ర డిప్రెషన్ కు గురయినట్లున్నాడు. ఈ ఆందోళనను భరించలేక ప్రాణాలు తీసుకోవాలన్న దారుణ నిర్ణయానికి వచ్చాడు అజయ్. ఒంటరిగా వున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

తీవ్ర అస్వస్థతకు గురయిన అజయ్ ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అక్కడ డాక్టర్లు వెంటనే వైద్యం అందించడంతో అజయ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి ప్రాణాలతో బయటపడ్డాడు. 

ఇదిలావుంటే ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంలో పాల్గొన్ని కీలక నిందితులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా డిఫెన్స్ ఉద్యోగాల కోసం యువకులను సంసిద్దం చేసే కోచింగ్ సెంటర్లు సికింద్రాబాద్ విధ్వంసంలో ప్రధానపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ వీడియోలు, వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసానికి విద్యార్థులను రెచ్చగొట్టిన వారిని అరెస్ట్ చేసారు.  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసును సిట్‌కు బదిలీ చేశారు. ఈ దాడిలో పాల్గొన్నవారిలో అత్యధిక శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ఎస్పీ అనూరాధ తెలిపారు.  

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న విధ్వంసం కేసులో 50 మందికిపైగా ఆధారాలతో సహా అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. రెండు వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. కోచింగ్ సెంటర్లు ఆర్మీ ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టాయని.. సదరు కోచింగ్ సెంటర్లను గుర్తించామని అనురాధ తెలిపారు. వీరందరికీ రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం వుందని ఆమె వెల్లడించారు. అలాగే యువకులను రెచ్చగొట్టిన వాట్సాప్ గ్రూప్‌లను కూడా గుర్తించామని అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని ఎలా దాడి చేయాలో చర్చించుకున్నారని అనురాధ పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios