ఆ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న ఉప ఎన్నిక భయం.. అసలు ఏం జరుగుతోంది...
హుజురాబాద్ ఉప ఎన్నికలో (huzurabad bypoll) టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఉప ఎన్నిక భయం వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో (huzurabad bypoll) టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోలేదు. ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో పాటు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్.. ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఇంత పెద్ద మొత్తంలో నేతలు మోహరించిన అక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించడంతో.. అధికార పార్టీకి గట్టి షాకే తగిలింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఉప ఎన్నిక భయం వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇందులో ఒకరు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాగా, మరొకరు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. గువ్వల బాలరాజు విషయానికి వస్తే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే హుజురాబాద్‌లో ఈటల విజయంతో చాలా మంది ఎప్పుడు రాజీనామా చేస్తావంటూ..? గువ్వల బాలరాజును ప్రశ్నిస్తున్నారు. కొందరైతే నేరుగా ఆయనకే ఫోన్ చేసి మాట నిలబెట్టుకోవాలని, రాజీనామా చేయాలని అడుగుతున్నారు. దీంతో ఆయన తనకు ఫోన్ చేసినవారితో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో బాలరాజు తన ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. ఇక, సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటుగా పలువురు నెటిజన్లు.. గువ్వల బాలరాజు లక్ష్యంగా రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆయనపై మీమ్స్ రూపంలో ట్రోలింగ్ చేస్తున్నారు.
Also read: Dalit Bandhu: హుజురాబాద్ ఎఫెక్ట్.. దళిత బంధుపై నీలినీడలు.. కేసీఆర్ ఊగిసలాట
అయితే ఈ క్రమంలో స్పందించిన బాలరాజు.. ఈటల రాజేందర్ నిజాయితీగా గెలిచి ఉంటే తాను రాజీనామా చేసేవాడినని వ్యాఖ్యానించారు. ఈటల దౌర్జన్యంతో, కుట్రలతో గెలిచారని ఆరోపించిన ఆయన.. అలాంటప్పుడు తానెందుకు రాజనీమా చేయాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అయితే ఆయన ఎన్ని చెప్పినా కూడా బాలరాజుపై నెటిజన్లు దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.
వేములవాడలో చెన్నమనేని రమేష్..
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం బీజేపీలో ఫుల్ జోష్‌ను నింపింది. కమలం నాయకుల్లో ఆత్మ విశ్వాసం రెట్టింపు అయింది. అయితే మరో రెండేళ్లకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అయితే ఈలోపే వేములవాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ దిశగా ఇప్పటి నుంచే పావులు కూడా కదుపుతున్నాయి. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేష్.. పౌరసత్వంపై వివాదం కొనసాగుంది. ఇందుకు సంబంధించిన కేసు విచారణ హైకోర్టులో కొసాగుతుంది. ఇక, రమేష్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌ను సమర్పించడంతో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది.
Also read: దళిత బంధు అమలు కోరుతూ ఈ నెల 9న బీజేపీ ఆందోళనలు
అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల చెన్నమనేని విజయం తర్వాత.. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని ఆది శ్రీనివాస్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసులో చెన్నమనేనికి తీర్పు వ్యతిరేకంగా వస్తే.. వేములవాడలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో బీజేపీ ఆ రకమైన ఆశలు పెట్టుకుంది. ఇప్పటి నుంచే వేములవాడ టార్గెట్‌గా ముందుకు సాగుతుంది. ఇప్పటికే వేములవాడ ఉప ఎన్నికకు తాము సిద్ధమవుతున్నామని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రమేశ్‌పై ఎప్పుడైనా అనర్హత వేటు పడుతుందన్న నమ్మకంతో తమ పార్టీ సన్నాహక సమావేశాలు ప్రారంభించామని చెప్పారు.