Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రకాష్ రెడ్డి రాజీనామాతో అమరచింతలో అలజడి

తెలంగాణ ప్రకాష్ రెడ్డి రాజీనామాతో అమరచింతలో అలజడి
Advocate generals resignation ignites commotion in Amarachinta

తెలంగాణ అడ్వొకెట్ జనరల్ గా ఉన్న దేశాయి ప్రకాష్ రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలంగాణ సిఎస్ శైలేంద్ర కుమార్ జోషికి పంపారు. ఆయన ద్వారా రాజీనామా లేఖ గవర్నర్ వద్దకు చేరింది. అయితే ఇప్పటి వరకు అడ్వొకెట్ జనరల్ రాజీనామాపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజీనామా ఆమోదించాలా తిరస్కరించాలా అన్నదానిపై సర్కారు కసరత్తు చేస్తున్నది. తీవ్రమైన మనస్థాపంతోనే ప్రకాష్ రెడ్డి రాజీనామా చేసినట్లు చర్చ జరుగుతున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు కేసులో వీడియో పుటేజీ ఇస్తానని హైకోర్టుకు హామీ ఇచ్చిన విషయంలో వివాదం చెలరేగినట్లు చెబుతున్నారు.


ఇక ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేసినట్లు మీడియాలో వార్తలు రావడంతో ఆయన పుట్టి పెరిగిన అమరచింతలో అలజడి రేగింది. ఎందుకు ఉన్నట్లుండి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేశారని ఒకరినొకరు చర్చించుకున్నారు. ప్రకాష్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింత మండల కేంద్రం. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసిన రోజుల్లో ఎప్పుడైనా శని, ఆదివారాల్లో అమరచింత వచ్చేవాడని, అక్కడి వారు చర్చించుకుంటున్నారు. గ్రామ పెద్దలతో కలిసి అభివృద్ధి పనుల్లో భాగస్వామి అయినట్లు గ్రామస్థులు అంటున్నారు. అమరచింత గ్రామాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల కేంద్రంగా ప్రకటించారు. అలా మండల కేంద్రంగా ఏర్పాటు చేయించడంలో ప్రకాష్ రెడ్డి పాత్ర కూడా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. అడ్వొకెట్ జనరల్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామానికి రావడం తగ్గించినట్లు చెబుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 11న అమరచింతలో టిఆర్టీటి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరై విద్యార్థులకు క్లాస్ చెప్పారని అంటున్నారు. అప్పటినుంచి గ్రామానికి రాలేదని అంటున్నారు.


తెలంగాణ రాష్ట్రానికి రెండో అడ్వొకెట్ జనరల్ గా 2017 జులై 18న ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. కేవలం 8 నెలలు మాత్రమే ఈ పదవిలో కొనసాగారు.  అంతకంటే ముందు తొలి అడ్వొకెట్ జనరల్ గా రామకృష్ణారెడ్డి పనిచేశారు. అడ్వొకెట్ జనరల్ పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో అడ్వొకెట్ జనరల్ పదవుల్లో నియమితులైన వారు పూర్తి కాలం బాధ్యతలు చేపట్టిన దాఖలాలున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం రెండో అడ్వొకెట్ జనరల్ ఇలా కేవలం 8 నెలల కాలంలోనే తన పదవిని వీడిపోవడం న్యాయ వర్గాల్లో సంచలనం కలిగింది. తొలి అడ్వొకెట్ జనరల్ రామకృష్ణారెడ్డి తన పదవి నుంచి వైదొలిగిన సందర్భంలోనే కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వంతో చివరి సమయంలో ఆయన సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో రెండో అడ్వొకెట్ జనరల్ అనతికాలంలోనే తన పదవి నుంచి వైదొలగడం ఇటు న్యాయ వర్గాల్లోనే కాక అటు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. అమరచింత గ్రామంలో మాత్రం ప్రకాష్ ఎందుకు రాజీనామా చేసిండబ్బా అని జనాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios