తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రాజకీయ విబేదాలు బైటపడ్డాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పిసిసి ప్రెసిడెంట్ పై అసంతృప్తితో ఆదిలాబాద్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు.

తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బస్సు యాత్ర ఏర్పాట్లు, కార్యక్రమాలను సమన్వయ పరిచేందుకు పిసిసి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బస్సు యాత్ర కమిటీ కన్వీనర్ గా ఏలేటి వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాజాగా ఏలేటి ఈ కన్నవీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగింది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ అందుకోసం సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఇలా ఓ జిల్లా ప్రెసిడెంట్ తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లబుచ్చడం కాంగ్రెస్ కాస్త ఇబ్బందికరమే. అయితే ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు కొందరు రాష్ట్ర స్థాయి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.