ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా దిలావర్ పూర్ మండలం గుండంపల్లిలో సినీనటుడు సునీల్ హల్ చల్ చేశారు. సినిమాలలో బిజీబిజీగా ఉంటే సునీల్ తన అభిమాని కోరిక మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

రాజకీయాలు అంటేనే ఆమడ దూరంలో ఉండే సునీల్ తన అభిమాని గెలుపుకోసం పల్లెబాట పట్టారు. గుండంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఆయన అభిమాని టీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలోకి దిగారు. దీంతో ఆయనకు మద్దతుగా సునీల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలేనని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని సునీల్ కోరారు. సునీల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనండంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సునీల్ తో ఫోటోలు దిగారు.