Guvvala Balaraju: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం నాడు రామచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

Guvvala Balaraju joins in BJP: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరబోతున్నారనే ఉత్కంఠకు తెర పడింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసిన ఆయన నేడు ( ఆదివారం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కమలం పార్టీ కండువా కప్పి అధికారికంగా గువ్వల‌ బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగింది. గువ్వల బాలరాజుతో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా కాషాయ కండువా కప్పుకొని, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

 అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. బీజేపీలో తన రాజకీయ ప్రయాణాన్ని సామాన్య కార్యకర్త మాదిరిగానే ప్రారంభిస్తానని తెలిపారు. దేశ రక్షణ, అవినీతి రహిత సమాజం కోసం పోరాడుతున్న బీజేపీలో తాను కూడా ఓ భాగస్వామ్యం అవుతానని తెలిపారు. గత రెండు దశాబ్దాలు తాను బీఆర్ఎస్‌ పార్టీకి నిబద్ధత చూపినట్లే బీజేపీలో కూడా అదే స్పూర్తితో కొనసాగుతాననీ, అదేవిధంగా ఈ పార్టీలో కూడా ఉంటానని తెలిపారు.

బీజేపీ పార్టీలో చేరేందుకు అనేక కారణాలు ఉన్నాయని, ప్రజల్లో బీజేపీపై ఆదరణ పెరుగుతున్నదనీ, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని బాలరాజు తెలిపారు. అందుకే ఆయన ఈ పార్టీని ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ పార్టీకి అనుకోకుండా రాజీనామా చేయడంపై గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో అచ్చంపేట ప్రజలు, తన అనుచరుల నుండి క్షమాపణలు కోరారు. తన పార్టీ మారటానికి కారణం బీఆర్ఎస్‌ పార్టీనే అని స్పష్టం చేశారు.

తాను పార్టీకీ రాజనామా చేస్తున్న విషయం ముందుగానే తెలియజేస్తే బీఆర్ఎస్‌ “ప్లాన్ బీ” అమలు చేస్తుందనీ, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తారనే, ఎవరితో తాను ఈ విషయంచర్చించలేదని తెలిపారు. అందుకు తెలియకుండా రాజీనామా చేసినట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు, ఆయన తన నమ్మకం కోసం పోరాటం చేస్తున్నారని, అదే ఆవేశంతో తన ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీని బలపరిచే కార్యాచరణలో గువ్వల బాలరాజు సేవలు కీలకంగా ఉపయోగపడతాయని రామచందర్‌రావు తెలిపారు.

బీజేపీలో చేరకముందు మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఘాటుగా విమర్శలు చేశారు. “కేటీఆర్ నాకు పెద్దోడేమీ కాదు. విదేశాల్లో చదువుకున్నాడు, కానీ నాకు ఉన్న అనుభవం ఆయనకు లేదు. రాబోయే రోజుల్లో నేనేంటో ఆయనకు చూపిస్తా. గ్రామాల్లో అడుగుపెట్టనివ్వను” అని హెచ్చరించారు. తనతో పాటు ఎవరూ బీజేపీలో చేరలేదని, ఒక్కడినే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

గువ్వల బాలరాజు గులాబీ బాస్ కేసీఆర్‌ కు అత్యంత సన్నిహితుడు, ఆయన అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలిచింది. రాజీనామా సమయంలో ఆయన పార్టీ హైకమాండ్‌ తనపై దాడులు జరిగినా పట్టించుకోలేదని, సరైన గుర్తింపు కూడా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరడం రాజకీయంగా చర్చనీయంగా మారింది.